PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

 రైతులకు 90శాతం సబ్సిడీతో… విత్తనాలు ఇవ్వాలి

1 min read

ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.జగన్నాథం

పల్లెవెలుగు: రైతులకు 90 శాతం సబ్సిడీ ద్వారా అన్ని రకాల విత్తనాలు ఇవ్వాలని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. జగన్నాథం అన్నారు. సోమవారం కర్నూలు ఏపీ రైతు సంఘం పిలుపు మేరకు 20 మండలాల్లో ధర్నాలు జరిగాయి. అందులో భాగంగా కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగిన ధర్నాకు సీపీఐ నగర కార్యదర్శి పి.రామకృష్ణారెడ్డి అధ్యక్షత వహించారు. ఈ ధర్నాను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ రైతులు వ్యవసాయం చేయడానికి తటపటాయిస్తున్నారని అన్నారు. విత్తనాల ధరలు,రసాయనిక ఎరువులు,పురుగుల మందులు ట్రాక్టర్ బాడుగలు, డీజిల్,పెట్రోల్ ధరలు, కూలి రేట్లు తదితర ధరలన్నీ పెరిగిపోతున్నాయని, కానీ పంట దిగుబడి మాత్రం పెరగడం లేదని, గిట్టుబాటు ధరలు పెరగవని,వ్యవసాయం అంటే పెను భారంగా మారిందని అన్నారు. ఈ భారంలో పాలకులు కొంత భరిస్తే రైతుల కష్టించి పంటలు వేస్తారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వస్తే రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని, వ్యవసాయాన్ని పండుగ చేసుకోండి అని అనేక ప్రగల్బాలు పలికి, వ్యవసాయాన్ని గాలికి వదిలేశారని విమర్శించారు. సబ్సిడీలు పెంచకుండా, పెట్టుబడిదారులకు సబ్సిడీలు పెంచుతున్నారని పేద రైతులకు సబ్సిడీలు తగ్గిస్తున్నారని అన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ ఘోరంగా ఉందని, రైతుకు ఇప్పుడు వచ్చే రైతు భరోసా డబ్బులు ఏమాత్రం సరిపోవని అన్నారు. ఒక ఎకరాకు కనీసం 15 వేల రూపాయలు ఒకే దఫాలో ఇవ్వాలని గరిష్టంగా ఐదు ఎకరాలకు ఇవ్వాలని, స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ ను పెరిగిన ధరలకు అనుగుణంగా పెంచి పంట రుణాలు ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వం ఇవన్నీ ఇవ్వాలనుకుంటే పెద్ద సమస్య కాదని అన్నారు. కావున ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేసి, కూలీల ఖర్చులు ప్రభుత్వమే భరించాలని, కౌలు రైతులకు సబ్సిడీ విత్తనాలు పంట రుణాలు ఇవ్వాలని అన్నారు. నకిలీ విత్తనాలు నాణ్యతలేని విత్తనాలు అమ్మే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి శిక్షించాలని అన్నారు. ఆగ్రో సంస్థ ద్వారా 90 శాతం సబ్సిడీపై వ్యవసాయ పరికరాలు ఇవ్వాలని, పాత అప్పులతో సంబంధం లేకుండా పంట రుణాలు ఇవ్వాలని అన్నారు. నకిలీ పురుగు మందులు నివారించి కల్తి లేని ఫెస్టిసైడ్స్ రైతు భరోసా కేంద్రం ద్వారా ప్రభుత్వమే ఇవ్వాలని, కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఎరువుల అంగళ్లలో ధరలు స్టాక్ బోర్డులు ఉంచాలని వారు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో మరిన్ని ప్రత్యక్ష ఉద్యమాలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించారు. ఈ ధర్నా కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు కె.పుల్లన్న, సీపీఐ నగర సహాయ కార్యదర్శి డి.శ్రీనివాసరావు, నాయకులు నాగరాజు, ఖాజా హుస్సేన్, రామాంజనేయులు, మౌలాలి తదితరులు పాల్గొన్నారు.

About Author