బడి ఈడు పిల్లల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
1 min read– విద్యాశాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: బడి ఈడు పిల్లల నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి సర్వే త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం నంద్యాల పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చైల్డ్ ఇన్ఫో అడ్మిషన్ ప్రోగ్రాం పనితీరును కలెక్టర్ పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వే కి సంబంధించి ఇంటర్మీడియట్ లో విద్యార్థులు ఎంతమంది అడ్మిషన్ పొందారు, ఇంటర్ ఫెయిల్ అయి తిరిగి కళాశాలలో చేరిన విద్యార్థులు ఎంతమంది తదితర వివరాలు పై కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కళాశాలలో చైల్డ్ ఇన్ఫో అడ్మిషన్ పొందేలా చర్యలు తీసుకోవాలన్నారు. కళాశాలలో చేరిన ప్రతి విద్యార్థి చైల్డ్ ఇన్ఫోలో నమోదు కావాలన్నారు. అడ్మిషన్ సమయంలో టిసి, స్టడీ ఇతర సర్టిఫికెట్ల జారీలో ఆటంకాలు ఎదురైతే సంబంధిత పాఠశాలల హెడ్మాస్టర్ లతో సంప్రదించి క్లియర్ చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో వాలంటీర్ ఏవిధంగా లాగిన్ అయి నమోదు చేస్తున్నాడన్న అంశాలపై కలెక్టర్ ఆరా తీస్తూ ఇద్దరు విద్యార్థుల డేటాను ఓపెన్ చేసి పరిశీలించారు. 5 నుండి 18 సంవత్సరాల్లోపు బడి బయట ఉన్న పిల్లలందరూ గ్రాస్ ఎన్రోల్మెంట్ సర్వేలో కచ్చితంగా నమోదై పాఠశాలల్లో చేరే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ విద్యాశాఖాధికారులను ఆదేశించారు.జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి, ఆర్ఐఓ గురువయ్య శెట్టి, డిఐవిఈఓ సునీతా, కళాశాల ప్రిన్సిపల్ సోమశేఖర్ ఉపాధ్యాయ బృందాలు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.