ఐటీ ఉద్యోగులకు కిడ్నీలలో రాళ్లు
1 min read– ఎక్కువగా ఏసీలో ఉండి.. నీళ్లు తాగకపోవడం వల్లే సమస్య
– కొందరిలో ప్రోస్టేట్ కేన్సర్లు కూడా..
– ఆలస్యంగా పెళ్లి.. ఆపై సంతానరాహిత్యం
– ప్రీతి యూరాలజీ, కిడ్నీ ఆస్పత్రి ఎండీ డాక్టర్ చంద్రమోహన్
– వైభవంగా ఆస్పత్రి రెండో వార్షికోత్సవం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: ఐటీ రంగంలో చాలామంది ఎక్కువ సమయం ఏసీలలో గడపడం వల్ల మంచినీళ్లు సరిగా తాగడం లేదని, అందువల్ల వారికి కిడ్నీల్లో రాళ్లు ఏర్పడే సమస్య ఎక్కువగా కనిపిస్తోందని ప్రీతి యూరాలజీ ఆస్పత్రి ఎండీ, చీఫ్ యూరాలజిస్టు డాక్టర్ చంద్రమోహన్ తెలిపారు. కొందరిలో ప్రోస్టేట్ కేన్సర్లు కూడా కనిపిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఇక ఈ రంగంలోని పురుషులు ఆర్థికంగా స్థిరపడి, ఆలస్యంగా పెళ్లి చేసుకోవడంతో వారిలో కొందరికి అంగస్తంభన సమస్యలు, కొందరికి వేరే తరహా సమస్యల వల్ల సంతానరాహిత్యం కూడా ఎక్కువగా ఉంటోందని వివరించారు. వీటన్నింటికీ తమ ఆస్పత్రిలో వైద్యపరమైన, శస్త్రచికిత్సల పరమైన పరిష్కారాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. ప్రీతి కిడ్నీ అండ్ యూరాలజీ ఆస్పత్రి రెండో వార్షికోత్సవాన్ని ఆస్పత్రి ప్రాంగణంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఐటీ, సాఫ్ట్‌వేర్ పరిశ్రమ బాగా స్థిరపడిన ఈ ప్రాంతంలో ఆయా రంగాల్లోని ఉద్యోగులు, వాళ్ల తల్లిదండ్రులకు సేవలు అందించేందుకు ఈ ఆస్పత్రి బాగా పనిచేస్తోందని ఆయన ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆస్పత్రి ఎండీ డాక్టర్ చంద్రమోహన్ మాట్లాడుతూ, ‘‘70 పడకల ఆస్పత్రిగా ప్రారంభించిన ఈ ఆస్పత్రిలో గత రెండేళ్లలో 2000కు పైగా వివిధ ప్రొసీజర్లు చేశాం. ఇక్కడ అన్నిరకాల లాప్రోస్కొపీ, లేజర్, అడ్వాన్స్‌డ్ సర్జరీలు చేస్తున్నాము. 12 మంది వైద్యులు సహా మొత్తం 75 మంది సిబ్బంది ఉన్నారు. ఈ రెండు సంవత్సరాల్లో దాదాపు వందకు పైగా గేటెడ్ కమ్యూనిటీలలో మేం ప్రీతి కిడ్నీ ఆస్పత్రి ద్వారా అవగాహన శిబిరాలు నిర్వహించి, అసలు కిడ్నీ ఆరోగ్యం అంటే ఏంటో, యూరిన్ ఔట్‌పుట్, డయాబెటిస్, బీపీ అంటే ఏంటో చెప్పాం. దాంతో వారు అవగాహన పెంచుకుని స్వయంగా తాము రావడంతో పాటు తమ తల్లిదండ్రులను కూడా తీసుకొస్తున్నారు. ఇక్కడ పెద్ద ఆస్పత్రి కావడం, సింగిల్ స్పెషాలిటీ కావడంతో కిడ్నీలు-యూరాలజీకి సంబంధించి ఎలాంటి అనారోగ్యం వచ్చినా వెంటనే గుర్తించి ఇక్కడకు వస్తున్నారు. మా ఆస్పత్రికి వచ్చేవారిలో ఎక్కువమంది ఐటీ, కార్పొరేట్ ఉద్యోగులు, వాళ్ల కుటుంబసభ్యులే ఉంటున్నారు. ఐటీ రంగంలోని మహిళల్లో కొందరికి యూరిన్ లీక్‌కావడం లాంటి సమస్యలు, పెద్దవయసువారికి అయితే ప్రోస్టేట్, ఇతర కేన్సర్లు కనిపిస్తున్నాయి. చాలామంది లాప్రోస్కొపిక్ సర్జరీలపై ఆసక్తి చూపడం ఇక్కడ మరో విశేషం.
తక్కువ ధరలకే ప్యాకేజీలు
ఈ ప్రాంతవాసుల ఆరోగ్యాన్ని సంరక్షించాలన్న లక్ష్యంతో జనరల్ హెల్త్ చెకప్, కిడ్నీ చెకప్ ప్యాకేజీలను తక్కువ ధరలకే పెట్టాం. అలాగే ఆదివారాలు ప్రత్యేకంగా 600-700 స్థాయిలోనే అల్ట్రాసౌండ్ స్కానింగ్ సహా సగం ధరకే కిడ్నీ హెల్త్ చెకప్ ప్యాకేజీలు అందిస్తున్నాం. దాంతో మేం నిర్వహించిన అవగాహన శిబిరాలకు తోడు ఇంటర్‌నెట్ ద్వారా మరికొంత తెలుసుకుని, ముందుజాగ్రత్తగా కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి ఎక్కువమంది వస్తున్నారు. దీంతో కిడ్నీ కేన్సర్లు, బ్లాడర్ కేన్సర్లు, కిడ్నీ వైఫల్యాలతో ఎవరూ మరణించకుండా ముందుజాగ్రత్తగా చికిత్సలు, పరీక్షలు అందిస్తున్నాం. ప్రస్తుతం ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మాంసాహారం వల్ల ఇవి వచ్చే ముప్పు ఉంది’’ అని డాక్టర్ చంద్రమోహన్ వివరించారు. మూడు ప్రాంగణాలలో చికిత్సలుప్రీతి యూరాలజీ అండ్ కిడ్నీ ఆస్పత్రి 2006లో చిన్న క్లినిక్‌గా ప్రారంభమైంది. 2012లో 50 పడకలతో కేపీహెచ్‌బీ ప్రాంతంలో పూర్తిస్థాయి ఆస్పత్రి ఏర్పాటైంది. 2018లో బీహెచ్ఈఎల్‌లో 100 పడకల ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ ఆస్పత్రికి నీట్ ద్వారా డీఎన్‌బీ యూరాలజీ సీట్లు కూడా ఉండటం గమనార్హం. 2021లో కరోనా సమయంలో ఎమర్జెన్సీ ఆస్పత్రిని ప్రారంభించగా, తర్వాత అది యూరాలజీ ఆస్పత్రిగా మారింది. ఇక్కడ యూరాలజిస్టులు డాక్టర్ హేమ్‌నాథ్, డాక్టర్ రాకేష్, డాక్టర్ కార్తీక్, నెఫ్రాలజిస్టు డాక్టర్ శ్యాంసుందర్, కార్డియాలజిస్టు డాక్టర్ అజిత్ కుమార్, రేడియాలజిస్టు డాక్టర్ రూప తదితరులు పూర్తిస్థాయిలో సేవలు అందిస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ జనరల్, అడ్వాన్స్‌డ్ యూరాలజీ శస్త్రచికిత్సలు, లేజర్ ద్వారా కిడ్నీలలో రాళ్ల తొలగింపు, ఆండ్రాలజీ, నెఫ్రాలజీ, కార్డియాలజీ సేవలు ఉన్నాయి. లేజర్, కీహోల్ పద్ధతుల ద్వారా యూరాలజీ, ఎండోయూరాలజీ శస్త్రచికిత్సలకు ఇది పెట్టింది పేరు.