చాప కింద నీరులా “కాల్ మనీ”
1 min read– ఈజీ మనీకి అలవాటు పడిన వడ్డీ వ్యాపారులు
– అప్పుల ఊబిలో బాధితులు
– అఘాత్యాలకు పాల్పడుతున్న కుటుంబ పెద్దలు
పల్లెవెలుగు వెబ్ అనంతపురం : అనంతపురం జిల్లాలోని పామిడి, గార్లదిన్నె మండల కేంద్రాల్లో స్థానికులతో పాటు పరిసర గ్రామాలకు చెందిన వడ్డీ వ్యాపారులు గుట్టు చప్పుడు కాకుండా కాల్ మనీ వ్యవహారం నడుపుతున్నారు. బాధితులు అవసరమైన ప్రతిసారి వడ్డీ వ్యాపారులను కలవాల్సిన పనిలేదు. ఒకసారి వాళ్ళని కలిసి వాళ్లకి కాళీ ప్రామిసరీ నోట్లపైన సంతకం చేసి, కాళీ చెక్కుల పైన సంతకం చేసి వాళ్ళకి ఇచ్చేస్తే సరిపోతుంది. అప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య వడ్డీ వ్యాపారం ప్రారంభమవుతుంది. బాధితులు అవసరం ఉన్నప్పుడు వడ్డీ వ్యాపారులకు ఫోన్ చేస్తే వడ్డీ పట్టుకొని మిగిలిన మొత్తం బాధితులకు ఇస్తారు. మరుసటి రోజు బాధితులు మొత్తం చెల్లించాలి. మరుసటి రోజుకు అసలు చెల్లించలేని పక్షంలో ప్రతిరోజు నూటికి పది రూపాయల ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది అని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విధంగా అవసరం కోసం, పరువు కోసం అధిక, దుబారా వడ్డీలకు అప్పులు చేసిన బాధితులు తిరిగి చెల్లించలేక పలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో అప్పుల బాధతో సంభవిస్తున్న మరణాలన్నీ కూడా ఈ కోవకు చెందినవే. గార్లదిన్నెలో పెద్ద సంఖ్యలో వడ్డీ వ్యాపారులు కాల్ మనీకి అలవాటు పడి.. పండ్ల వ్యాపారులు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యాపారులకు అధిక వడ్డీలకు డబ్బులు ఇచ్చి బాధితుల పైన విపరీతమైన ఒత్తిడి చేసి వేధింపులకు గురి చేస్తున్నట్లు బాధితులు వాపోతున్నారు. గార్లదిన్నెలో రోజుకి నూటికి పది రూపాయల వడ్డీ ప్రకారం చెల్లించలేక ఒక వ్యాపారి అనారోగ్యానికి గురై గత మార్చి నెలలో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. బాధితుడి బంధువులు విషయం తెలుసుకొని సకాలంలో వైద్యం అందించడంతో ఆ వ్యాపారి తిరిగి ఆరోగ్యంగా ఇంటికి చేరుకున్నాడు. పామిడి మండల కేంద్రంలోని ఎద్దులపల్లి రోడ్డులో ఒక అనధికారిక ప్రైవేట్ ఆఫీస్ ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున కాల్ మనీ వ్యవహారం నడుపుతున్నట్లు బాధితులు తెలిపారు. పామిడిలోని ఈ అనధికారిక కాల్ మనీ ఆఫీసు నుంచి ప్రతిరోజు లక్షల్లో చేతులు మారుతున్నట్లు బాధితులు తెలిపారు. ఇక్కడ కూడా జిల్లాలోని అనేక పెట్రోల్ బంకులకు రోజువారి వడ్డీలకు డబ్బులు ఇస్తున్నారని బాధితులు తెలిపారు. డబ్బులు ఇచ్చే ముందు తమ వద్ద ఖాళీ ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులపై సంతకాలు చేయించుకుని డబ్బులు ఇస్తున్నారని, దుబారా వడ్డీలు సకాలంలో చెల్లించని పక్షంలో కాల్ మనీ వ్యాపారులు బాధితులను ప్రైవేటు పంచాయతీలు, పెద్దమనుషుల తీర్మానాలు, ఇంకా అనేక రకాల ద్వారా బెదిరించి ఒత్తిడి చేస్తున్నట్లు ఒక బాధితుడు తెలిపాడు. దుబారా వడ్డీలకు ఆస్తులు సైతం రాయించుకుంటున్నారు. అధిక వడ్డీలకు ఆస్తులు పోగొట్టుకుంటున్న బాధితులు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అదేవిధంగా పామిడి మండల కేంద్రంలోని మెయిన్ బజార్లో ఒక వస్త్ర దుకాణం వ్యాపారి జిల్లాలోని అనేక పెట్రోల్ బంకులకు రోజు వారి వడ్డీలకు డబ్బులు ఇస్తున్నట్లు కొంతమంది పెట్రోల్ బంకుల వ్యాపారులు తెలిపారు. ఈ వస్త్ర వ్యాపారి కూడా కాళీ ప్రాంసరీ నోట్లు, ఖాళీ చెక్కులను తీసుకుని రోజువారి వడ్డీలకు ఇచ్చి కొంతమంది ఆస్తులను రాయించుకున్నట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.