కంబర్లండ్ యూనివర్సిటీలో స్పాట్ అడ్మిషన్లు
1 min read– హైదరాబాద్ విద్యార్థులకు ప్రత్యేక అవకాశం
– యూనివర్సిటీ హబ్ భాగస్వామ్యంతో అందిస్తున్న అమెరికా విశ్వవిద్యాలయం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్: అమెరికాలో 182 ఏళ్లకుపైగా చరిత్ర ఉన్న కంబర్లండ్ యూనివర్సిటీలో ప్రవేశాల కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ రెగీ బ్లెయిర్, అసోసియేట్ ప్రోవోస్ట్, జనరల్ కౌన్సెల్ డాక్టర్ మార్క్ హన్‌షా తెలిపారు. అమీర్‌పేటలోని ఆదిత్య పార్క్ హోటల్లో సోమవారం సాయంత్రం వారు విలేఖరులతో మాట్లాడారు. “నాష్‌విల్లెకు కేవలం 25 మైళ్ల దూరంలో ఉన్న ఈ యూనివర్సిటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న విద్యార్థులకు అనేక సంవత్సరాలుగా ముఖ్యమైన గమ్యస్థానంగా ఉంది. ఈ సంవత్సరం సరికొత్త గ్రాడ్యుయేట్ కోర్సులు పెట్టడంతో, భారతీయ విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు మరిన్ని అవకాశాలు ఉంటాయి. అంతర్జాతీయ విద్యార్థుల ఉనికి మా క్యాంపస్‌ను మరింత బలోపేతం చేస్తుంది, మా విద్యా అనుభవాన్ని మరింత సుసంపన్నం చేస్తుంది” అని అసోసియేట్ ప్రోవోస్ట్ డాక్టర్ మార్క్ హన్‌షా తెలిపారు.మేలో ప్రారంభమైన సమ్మర్ సెమిస్టర్‌లో మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఎంఎస్ఐటిఎం) డిగ్రీలో మొదటి బృందాన్ని కంబర్లండ్ యూనివర్సిటీ స్వాగతించింది. హైదరాబాద్‌లో ఉన్న అంతర్జాతీయ భాగస్వామి యూనివర్సిటీ హబ్ ఇప్పుడు పెరుగుతున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్ రంగాలలో చేరేందుకు విద్యార్థులకు కావల్సిన సహాయం చేస్తోంది.అమెరికాలో వ్యాపార, సాంకేతిక రంగాల్లో శరవేగంగా ఎదుగుతున్న కేంద్రాల్లో నాష్‌విల్లో ఒకటని హన్‌షా చెప్పారు. తమ విశ్వవిద్యాలయంలో చేరే విద్యార్థులు తమ కోర్సులో భాగంగానే ఈ వాణిజ్య కేంద్రం గురించి కూడా నేర్చుకునేందుకు తాము సాయపడతామన్నారు. కంబర్లండ్‌లోని ఎంఎస్ఐటీఎం డిగ్రీ, మాస్టర్ ఆఫ్ సైన్స్ ఇన్ ఇంజినీరింగ్ మేనేజ్‌మెంట్ (ఎంఎస్ఈఎం) రెండింటినీ హైబ్రిడ్ మోడల్లో నిర్వహిస్తున్నారు. వీటిలో క్లాసులు ఆన్‌లైన్‌లో ఉంటాయి, కొన్ని కోర్సులు మాత్రం కళాశాలలోనే ప్రత్యక్షంగా చెబుతారు. యూనివర్సిటీకి చెందిన లీడర్‌షిప్, ప్రోగ్రాం ప్రొఫెసర్లు విద్యార్థులతో కలిసి ఈ సరికొత్త డిమాండు ఉన్న కోర్సులపై దృష్టిపెట్టి, విద్యార్థులకు ముఖ్యంగా అంతర్జాతీయ సంబంధాలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, క్రిటికల్ థింకింగ్‌పై అవగాహన కల్పిస్తారు.
“ఈ కార్యక్రమాల రూపకల్పన వెనుక మా డ్రైవింగ్ ఫోర్స్.. ప్రధానంగా మా విద్యార్థుల అవసరాలను వినడమే” అని ఎన్‌రోల్‌మెంట్ విభాగం వైస్ ప్రెసిడెంట్ రెగీ బ్లెయిర్ చెప్పారు. “ఈ ప్రోగ్రాంలు, ఇలాంటి ఇతర కోర్సులు అందించడం ద్వారా విద్యార్థులకు వారి కెరీర్ అవకాశాలను మరింత ముందకు తీసుకెళ్తాం. వారికి కోర్సు ముగిసిన వెంటనే మంచి భవిష్యత్తు, ఆ తర్వాత కూడా అంతులేని అవకాశాలను సృష్టించడమే మా లక్ష్యం” అని బ్లెయిర్ అన్నారు.కంబర్లండ్ యూనివర్సిటీని 1842లో స్థాపించారు. అమెరికన్ చరిత్రలోనే దక్షిణ అమెరికాలో అత్యంత పురాతన ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఒకటిగా ఇది విశిష్ఠ స్థానం పొందింది. టెన్నెస్సీలో శరవేగంగా ఎదుగుతున్న యూనివర్సిటీలలో ఒకటిగా ఇది గుర్తింపు పొందింది. ఇక్కడ 48 దేశాలతో పాటు అమెరికాలోని 39 రాష్ట్రాల విద్యార్థులు ఉన్నారు. దక్షిణ అమెరికాలో అత్యుత్తమ ప్రాంతీయ యూనివర్సిటీలలో ఒకటిగా యూఎస్ న్యూస్ అండ్ వరల్డ్ రిపోర్ట్ దీన్ని గుర్తించింది. భారతదేశంలో యూనివర్సిటీ హబ్‌తో భాగస్వామ్యంతో కంబర్లండ్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా స్పాట్ అడ్మిషన్లను అందిస్తోంది. ఇక్కడకు విద్యార్థులు, వారి కుటుంబసభ్యులు వచ్చి, యూనివర్సిటీలో ఉన్న కోర్సులు, వాటి వివరాలను తెలుసుకోవచ్చు. అవసరమైన పత్రాలు తీసుకొచ్చి, కంబర్లండ్ ప్రవేశాల ప్రతినిధులతో స్వయంగా మాట్లాడుకోవచ్చు. అర్హులైన విద్యార్థులకు జులై 19న నిర్వహించే స్పాట్ అడ్మిషన్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది. అది కంబర్లండ్ యూనివర్సిటీలో ప్రవేశానికి మొదటి అడుగు.
కంబర్లండ్ విశ్వవిద్యాలయం గురించి:182 సంవత్సరాలకు పైగా, కంబర్లండ్ విశ్వవిద్యాలయం ప్రపంచాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, అభివృద్ధి చెందించడానికి, ప్రకాశవంతం చేయడానికి తనవంతు ప్రయత్నాలు చేస్తోంది. టెన్నెస్సీ రాష్ట్రంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న లిబరల్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఒకటిగా గుర్తింపు పొందింది. ఇక్కడ అసోసియేట్, బాచులరియేట్, మాస్టర్స్ స్థాయుల్లో 80 కి పైగా గుర్తింపు పొందిన కోర్సుల ద్వారా అద్భుతమైన మార్పులు తీసుకొచ్చే ఉన్నత విద్యను అందిస్తుంది.