ఎస్సీ నియోజకవర్గంలో మీ పెత్తనం ఏమిటి…
1 min read– దళిత నియోజకవర్గం లో అగ్రవర్ణాల పెత్తనం సాగనీవ్వం.
– మాల మహానాడు. వైసిపి ఎస్సీ సెల్ నాయకుల హెచ్చరిక.
పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు : నందికొట్కూరు నియోజకవర్గ దళిత ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ ను ప్రభుత్వ ప్రారంభోత్సవ కార్యక్రమాలకు పిలవకుండా అవమానించిన రాష్ట్ర మంత్రి ఆర్కే రోజా, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచ బ్రహ్మానందరెడ్డి , శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి లు అవమానపరచడంతో తమ అధికార వైసిపి పార్టీకి సిగ్గుచేటు అన్నారు. మాల మహానాడు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాల మహానాడు సీనియర్ నాయకులు డాక్టర్ రాజు, మాల మహానాడు తాలూకా అధ్యక్షుడు అచ్చు గట్ల నగేష్, నంద్యాల జిల్లా వైసీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సగినేల రమణ, నంద్యాల జిల్లా ఎస్సీ మానిటరింగ్ కమిటీ సభ్యుడు దిలీప్ లు వైసీపీ పార్టీలోని మరో వర్గానికి చెందిన నాయకుల పైన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ నియోజకవర్గంలో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగించడం శోచనీయమన్నారు. అగ్రవర్ణాల నియోజకవర్గం లో ఎస్సీల పెత్తనం ఉంటుందా అని వారు ప్రశ్నించారు. ఎమ్మెల్యే ఆర్థర్ దళితుడైనందున మంత్రి ,ఎంపీ ,చైర్మన్ లు ప్రారంభోత్సవాలకు పిలవకుండా నందికొట్కూరు నియోజకవర్గం లో అగ్రవర్ణాల పెత్తనం కొనసాగించారన్నారు. భారత రాజ్యాంగంలో దళితులకు జనాభా నిష్పత్తి ప్రకారము చట్టసభలలో రిజర్వేషన్లు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించడం జరిగిందన్నారు. నియోజకవర్గ ప్రథమ పౌరుడిని ప్రారంభోత్సవానికి పిలవకుండా కేవలం అగ్రవర్ణాలకు చెందిన ప్రజాప్రతినిధు లే పాల్గొనడం నియోజకవర్గ దళిత జాతిని అవమానించడ మే అన్నారు. ఎమ్మెల్యే తోగూరు ఆర్థర్ సౌమ్యుడు కాబట్టి ఎలాంటి ఆందోళనలు చేపట్టవద్దని చెప్పడం దళిత జాతికి పిలుపు ఇవ్వడం దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించింది అన్నారు. రాజకీయ పార్టీ ల అధ్యక్షులైన జగన్ మోహన్ రెడ్డి , టిడిపి జాతీయ అధ్యక్షులు చంద్రబాబు లు దళిత నియోజక వర్గాలకుప్రాతినిధ్యం వహించే ప్రజాప్రతినిధుల కే సర్వాధికారులు కట్టబెట్టాలని వారు డిమాండ్ చేశారు. నందికొట్కూరు ఎమ్మెల్యే కు జరిగిన అవమానంపై పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు బొల్లవరం మనోహర్, వైసిపి ఎస్సీ సెల్ నాయకులు తాటిపాటి అయ్యన్న, శాతనకోట ఆర్య వెంకటేష్ ,కదిరి సుబ్బన్న,రాజు, తదితరులు పాల్గొన్నారు.