PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బడిఈడు పిల్లలు బడిలోనే ఉండాలి…

1 min read

– మూడు రోజుల్లో సమగ్ర నివేదిక సమర్పించాలి…

– పాఠశాలలను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్

పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా :  పాఠశాలల్లో డ్రాప్ అవుట్స్ నివారణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జిల్లా విద్యాశాఖాధికారి  శ్యాం సుందర్  పాఠశాలల తనిఖీలో భాగంగా బుధవారం ఉదయం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.  ఇందులో భాగంగా  ఏలూరు నగర పాలక సంస్ధ కస్తూరిబా బాలికల ఉన్నత  పాఠశాలను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆకస్మిక తనిఖీ చేశారు.  మద్యలో బడిమానేసిన విద్యార్ధుల వివరాలను ఆరా తీశారు.  బడిమానేసిన పిల్లలు ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతానికి వెళ్లింది వివరాలను వాకబు చేశారు.   ఈ సందర్బంగా ఉపాధ్యాయులతో సమీక్షిస్తూ ఎవరైతే పిల్లలు మద్యలో బడిమానివేశారో వారి ఇంటికి నేరుగా వెళ్లి ఆయా తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించి తిరిగి పాఠశాలల్లో చేర్చేలా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.  ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధపెట్టి మూడు రోజుల్లో మద్యలో బడిమానివేసిన పిల్లలను తిరిగి పాఠశాలల్లో చేర్చడం లేదా వారు ఏ ప్రాంతానికైనా వెళ్లిఉంటే సంబంధిత వివరాలతోకూడిన నివేదికను అందజేయాలన్నారు.  ఈ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే అటువంటి వారిపై  కఠిన చర్యలు తీసుకోవాలని డిఇఓను కలెక్టర్ ఆదేశించారు.  మద్యలో బడిమానివేసిన విద్యార్ధుల తల్లిదండ్రులవద్దకు వెళ్లి వారిని చేర్పించే విధంగా ఫోటోతో సహా పంపించాలని అదే విధంగా తల్లిదండ్రులు విద్యార్ధులను బడిలో చేర్పించడానికి ఇబ్బంది కరంగా వ్యవహరిస్తే ఉపాధ్యాయులు ఒక బృందంగా వెళ్లి ఆయా తల్లిదండ్రులకు నచ్చజెప్పి వారి భవిష్యత్ గురించి కౌన్సిలింగ్ ఇవ్వాలని అందుకు సంబంధించిన ఫోటోలు కూడా పంపాలని సూచించారు. చివరిగా బడిలో చేరని విద్యార్ధులయొక్క పూర్తి వివరాలను సంబంధిత ఉపాధ్యాయుల అనుసంధానం చేసి బాధ్యత పెట్టాలన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ ప్రతి బుధవారం డ్రాప్ అవుట్స్ పై నిర్వహించే ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమంలో  భాగంగా జూలై 19 వ తేదీ బుధవారం గ్రాస్ ఎన్ రోల్ రేషియో(జిఇఆర్) జిల్లా యంత్రాంగం అంతా మద్యలో బడిమానివేసిన పిల్లలను కలుసుకొని వారిని తిరిగి పాఠశాలలకు తీసురావడానికి కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు.  10వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులు 12వ తరగతి ఫెయిల్ అయిన విద్యార్ధులు, ప్రత్యేక అవసరాలుగలపిల్లలు, సంచార కుటుంబాలకు సంబంధించిన పిల్లలు వంటి వారిపై మరింత దృష్టిపేట్టాలని ఆదేశించడం జరిగిందన్నారు.  ఇందుకు సంబంధించిన జిల్లా పనితీరు నివేదికను రేపటిలోగా సమర్పించాలని విద్యాశాఖ ఆదేశించడం జరిగిందన్నారు.   పిల్లల భవిష్యత్ బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గమన్న వాస్తవాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులకు తెలియజెప్పి బడిఈడు పిల్లలు బడిలోనే ఉండేలా కృషి చేయాలని విద్యాశాఖాధికారులను జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ ఆదేశించారు.  మద్యలో బడిమానివేసిన వారి అందరిని గుర్తించడంతోపాటు వారిని తిరిగి పాఠశాలల్లో చేర్పించాలన్నదే మనముందున్న బాధ్యత అన్నారు.  మనం ఎంతకష్టపడినా అది పిల్లలకోసమే పిల్లల భవిష్యత్ బాగుండాలంటే చదువు ఒక్కటే మార్గం అన్న విషయాన్ని విద్యార్ధుల తల్లిదండ్రులకు విశదీకరించాలన్నారు.  ఇతర ప్రాంతాలకు వలస వెళ్లినవారి వివరాలను సేకరించి ఆ పిల్లలు ఏస్కూల్లో తిరిగి చేరింది వివరాలు రాబట్టాలన్నారు.   టిసి తీసుకొని వెళ్లే విద్యార్ధుల వారి తదుపరి చిరునామా, మొబైల్ నెంబర్లను రిజిష్టర్ లో తప్పనిసరిగా నమోదు చేయాలన్నారు.  బడిబయట ఉన్న పిల్లలను ఓపెన్ స్కూల్స్ లో విద్యనందించి వచ్చే విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆయా పాఠశాలల్లో చేర్చేలా పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు.  ఆరోగ్య సంబంధ విషయాలపై బడిమానివేసి ఉంటే అందుకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరించాలన్నారు.  పేద ప్రజలపై భారం పడకుడదనే వారి పిల్లలకు అమ్మఒడి, విద్యాకానుక, వసతిదీవెన వంటి ఎన్నో కార్యక్రమాలను ప్రభుత్వం అందిస్తూ పిల్లలు చదువుకోవడానికి కృషిచేస్తున్నదన్నారు.

About Author