ఓటర్ల లిస్ట్ ప్యూరిఫికేషన్ పకడ్బందీగా నిర్వహించండి
1 min read– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: స్పెషల్ సమ్మరీ రివిజన్ 2024 లో భాగంగా ఓటర్ల లిస్ట్ ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన బూత్ లెవల్ అధికారులను ఆదేశించారు.బుధవారం కర్నూలు నగరంలోని దండిగేరి లోని 20 వ, పెద్దపడఖానాలోని 21 వ సచివాలయములను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, నగరపాలక కమిషనర్ భార్గవ తేజలతో కలిసి తనిఖీ చేసి బూత్ లెవల్ అధికారులకు సూచనలు ఇచ్చారు .ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషన్ వారి ఆదేశాల మేరకు నగరంలోని ఓటర్ల లిస్ట్ ప్యూరిఫికేషన్ కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని బూత్ లెవల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ముఖ్యంగా ఒకే ఇంటిలో పదిమంది ఓటర్లు ఉన్నట్లయితే అటువంటి ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు, వాస్తవానికి సంబంధిత ఓటర్లు ఆ ఇంట్లో లేకపోతే ఫారం 8 ద్వారా తొలగించాలని, ఒకవేళ వారు వేరే ఇంటికి మారినట్లయితే ఫారం 7 ద్వారా వారి చిరునామా మార్పు చేయాలని కలెక్టర్ బూత్ లెవెల్ అధికారులను ఆదేశించారు. రేపటి నుండి ఆగస్టు 21వ తేది వరకు బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వెళ్లి ఓటర్ల లిస్ట్ స్వచ్చీకరణ చేసే కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలన్నారు. సర్వే కి వెళ్ళినప్పుడు 18 సంవత్సరములు నిండిన వారు ఆ ఇంట్లో ఉన్నట్లైతే వారిని ఓటరుగా నమోదు చేయాలని, ఓటు ఉన్న వ్యక్తి మరణించి ఉంటే వారి ఓటును ఓటర్ లిస్ట్ నుండి తొలగించాలని ఈ కార్యక్రమాలను అతి జాగ్రత్తగా నిర్వహించాలని కలెక్టర్ సంబంధిత అధికారులు ఆదేశించారు. నగరంలో ఒక్కటే ఇంటి చిరునామాలో 10 మంది ఓటర్లు ఉన్న ఇళ్లను గుర్తించామని అటువంటి ఇళ్ళ దగ్గరికి వెళ్లి పరిశీలిస్తున్నామని వాస్తవానికి ఇంటి నెంబర్ ఒకటే ఉన్న ఆ ఇంటి మొదటి అంతస్తులోనూ, రెండవ అంతస్తులోనూ ఓటర్లు ఉన్నట్లుగా గమనించామని అలాంటి ఓటర్లు ఉన్న ఇంటికి మొదటి ఫ్లోర్ కి – A, రెండో ఫ్లోర్ కి – B, మూడో ఫ్లోర్ కి – C లాగా నంబర్ల ను కేటాయించనున్నామని నగర పాలక సంస్థ కమిషనర్ భార్గవ తేజ కలెక్టర్ కు వివరించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్, కర్నూలు రూరల్ తహసిల్దార్, తదితరులు పాల్గొన్నారు.