ఫిష్ ఆంధ్ర యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలి
1 min read– జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్.
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఫిష్ ఆంధ్ర యూనిట్లను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ పేర్కొన్నారు.గురువారం నంద్యాల పట్టణంలోని పద్మావతి నగర్ ఇండోర్ స్టేడియం రోడ్ లో ఫిష్ ఆంధ్ర 10 లక్షల విలువ చేసే యూనిట్ ను జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, స్థానిక శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి తదితరులు ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద ఫిష్ ఆంద్ర యూనిట్ల స్థాపనకు నిరుద్యోగ యువత, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. జిల్లాలో మొదటిసారిగా ఏపీజీబీ బ్యాంక్ సహకారంతో శ్రీమతి డి రజియాబి10 లక్షల ఫిషాంద్ర యూనిట్ ను స్థాపించారన్నారు. జిల్లాకు మంజూరైన 10 లక్షల విలువగల 25 యూనిట్లు, 20 లక్షల విలువగల 7 యూనిట్లు, 50 లక్షల విలువగల రెండు యూనిట్లను 40, 60 శాతం సబ్సిడీతో వినియోగించుకునేందుకు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానందరెడ్డి, స్థానిక శాసనసభ్యులు శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డిలు మాట్లాడుతూ ఆధునిక జీవనశైలికి అనుగుణంగా, ఆరోగ్యపరంగా చేపలు, రొయ్యల ఉత్పత్తులను రెడీ టు ఈట్ పద్ధతిలో పిజ్జా, బర్గర్, రోల్స్, ప్రాన్ టిక్కా, ఫ్రెంచ్ ప్రైస్, క్రాబ్ స్టిక్స్ ఉత్పత్తులు ప్రజలకు ఫిష్ ఆంధ్ర ద్వారా లభ్యమవుతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ భరత్ కుమార్ రెడ్డి బెస్త డైరెక్టర్ చంద్రశేఖర్, మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ రాఘవరెడ్డి, ఏడి సంధ్యారాణి, డిఆర్డిఏ పిడి శ్రీధర్ రెడ్డి, ఉద్యాన శాఖ అధికారి నాగరాజు, మున్సిపల్ కమిషనర్ రవిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.