వేదవతి ప్రాజెక్టుకి నిధులు కేటాయించి పనులను ప్రారంభించాలి
1 min read– ప్రాజెక్టు కోసం భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూ సేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరిహారము, పునరావాసం కల్పించాలని
కోరుతూ.
పల్లెవెలుగు వెబ్ ఆస్పరి: ఆగస్టు 3వ తేదీ నాడు ఆలూరు నియోజకవర్గంలో గ్రామ,వార్డు సచివాలయాల దగ్గర జరుగు ధర్నాలను జయప్రదం చేయండి.సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య.అస్పరి… ఆస్పరిలో స్థానిక సిపిఐ ఆఫీస్ లో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య మాట్లాడుతూ,కర్నూలుజిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గమని, త్రాగునీటికి సైతం తుంగభద్ర దిగువ కాలువ మీద ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవనం చేస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కావాలంటే వేదవతి ప్రాజెక్టు నిర్మాణమే ఏకైక శరణ్యం, వేదవతి ప్రాజెక్టు నిర్మాణానికి 1942 కోట్లు ఖర్చుతో ఆలూరు, హలహార్వి, చిప్పగిరి, హొలగుంద మండలాల్లో 80 వేల ఎకరాలకు సాగునీరు 250 గ్రామాలకు త్రాగునీరు అందించవచ్చునని నిపుణులు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ప్రాజెక్టు నిర్మాణ పనులు మెగా కంపెనీకి కాంట్రాక్టు అప్పజెప్పారు. మెగా కంపెనీ వారు 120 కోట్ల విలువ చేసే పైపు లైన్ పనులు చేశారు. అయితే ప్రభుత్వం కేవలం 16 కోట్ల రూపాయలు మాత్రమే నాలుగున్నర సంవత్సరాల కాలంలో వారికి బిల్లు చెల్లించి చేతులు దులుపుకున్నది. దీని కారణంగా కాంట్రాక్టర్ పనులను అర్ధాంతరంగా వదిలివేసి వెళ్లిపోయారు.ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం మెరుగైన నష్టపరిహారము ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు భూసేకరణ పూర్తి చేయకుండా, రైతులకు పరిహారం ఇవ్వకుండా, పునరావాసం కల్పించకుండా , నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఆలూరు నియోజకవర్గ ప్రజలకు తీవ్ర అన్యాయం జరుగుతున్నది.నిత్యం కరువుకు గురయ్యే ప్రాంతంలో సిరులు కురిపించే వెదవతి ప్రాజెక్టు నిర్మాణం పట్ల వై.యస్.జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో. అర్ధాంతరంగా పనులు నిలిచి పోవడంతో,ప్రాజెక్టు నిర్మాణం ఎప్పుడు పూర్తయితుందో అంతు చిక్కడం లేదు. నియోజకవర్గంలో ఆస్పరి మండలంలో ఎటువంటి నీటి వనరులు లేవు. మండలాన్ని వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి చేర్చి మండల ప్రజలకు సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనే ఆలోచన పాలకులకు లేకపోవడం చాలా బాధాకరం వేదవతి ప్రాజెక్టు పరిధిలోకి ఇప్పటికైనా ఆస్పరి మండలాన్ని చేర్చి న్యాయం చేయాలి, నియోజకవర్గ ప్రజలు త్రాగునీరు సైతం దొరకక అలమటిస్తున్నారు. కరువు కి గురవుతూ పంటలు లేక సుదూర ప్రాంతాలకు వలస పోయి ప్రజలు బ్రతుకు తున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, పాలకులు ఎందరో మారినా నియోజకవర్గ ప్రజల తలరాతలు మాత్రం మారడం లేదు. నిలిచిపోయిన వేదవతి ప్రాజెక్టు పనులను ప్రారంభించి సత్వరమే పూర్తి చేసి ఆలూరు నియోజకవర్గం లో అన్ని మండలాలకు సాగునీరు, త్రాగునీరు సాధనకై సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో దశలవారీగా ప్రభుత్వం మీద ఒత్తిడి చేయడానికి వివిధ రూపాలలో ఆందోళన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం, అందులో భాగంగా ఆగస్టు 3 వ తేదీ నాడు నియోజకవర్గంలో అన్ని గ్రామ/ వార్డు సచివాలయాల ముందు జరుగు ధర్నా ల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని బి.గిడ్డయ్య పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి బి.విరుపాక్షి, ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సి.రమేష్, రైతు సంఘం మండల అధ్యక్షులు ఆంజనేయ గార్లు పాల్గొన్నారు.వేదవతి ప్రాజెక్టు కు నిధులు కేటాయించి పనులు ప్రారంభించి అన్ని గ్రామాలకు సాగునీరు, త్రాగునీరు అందించడానికి కృషి చేయాలని ఆయన కోరారు.