ప్రజలకు వినోదాన్ని పంచే ఎగ్జిబిషన్ ను వ్యాపారం చేయొద్దు: టి.జి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: తమ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా కర్నూలు ప్రజలకు తక్కువ ధరకు వినోదాన్ని అందిస్తామని ఎగ్జిబిషన్ సొసైటీ అధ్యక్షుడు టి.జి భరత్ అన్నారు. నగరంలోని మౌర్య ఇన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎగ్జిబిషన్ సొసైటీ, కిడ్స్ వరల్డ్ ద్వారా గత 40 సంవత్సరాలుగా ప్రజలకు వినోదాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. అయితే ఈ సంవత్సరం కొత్తగా వేలం పాట ద్వారా ఎగ్జిబిషన్ నిర్వహించాలంటూ రాజకీయాలు చేయడం వల్ల వేసివిలో ప్రజలకు ఎగ్జిబిషన్ అందుబాటులో లేకుండా పోయిందన్నారు. ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా తాము నిర్వహించే ఎగ్జిబిషన్ కు మొదట్లో రూ. 5 , ఆతర్వాత రూ. 10 , ఆ తర్వాత రూ. 20 ఎంట్రీ ఫీజు పెట్టామని అయితే ఇప్పుడు నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ కు ఒక రేటు అంటూ లేదని.. నేడు రూ. 60 నుండి రూ. 100 దాకా ఎంట్రీ ఫీజు ఎంతైనా వసూలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అయితే తాము నిర్వహిస్తున్న సమయంలో ఇలాంటి పరిస్థితి లేదన్నారు. తాము నిర్వహిస్తున్న ఎగ్జిబిషన్ సొసైటీకి ఎక్స్ అఫిషియో ఛైర్మన్ గా జిల్లా కలెక్టర్ ఉంటారని, ఈ.సి మెంబర్లుగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఎగ్జిబిషన్ ద్వారా సొసైటీకి వస్తున్న ఆదాయం నుండి జిల్లా కలెక్టరుతో పాటు కర్నూలు మున్సిపల్ కార్పోరేషన్ కు కూడా అవసరానికి అనుగుణంగా నిధులు అందజేశామని.. సొసైటీ తరుపున 50 ఎకరాలు కొనుగోలు చేశామని వివరాలు వెల్లడించారు. అంతేకాకుండా ఎగ్జిబిషన్ సొసైటీ నుండి ఎంతో మందికి సహాయం చేశామన్నారు. వేలం పాట నిర్వహించడం ద్వారానే ఆదాయం వస్తుందనుకుంటే ప్రజలకు ఉచితంగా వైద్యసేవలు అందించే ప్రభుత్వ వైద్యశాలకు కూడా వేలంపాట నిర్వహించుకునే పరిస్థితి వస్తుందన్నారు. కర్నూలు ప్రజలకు అతి తక్కువ ధరకు వినోదాన్ని పంచాలన్న ఉద్దేశంతోనే ఏడాదిలో మూడు నెలల పాటు తమ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ప్రతి సంవత్సరం ఎగ్జిబిషన్ నిర్వహించేలా 2017 – 2018 లో తమకు కేటాయించారన్నారు. ఆ తర్వాత కరోనా వచ్చిందని, కరోనా తర్వాత పూర్తి స్థాయిలో ఈ ఏడాది ఎగ్జిబిషన్ నిర్వహించాలనుకుంటే కొందరు ప్రైవేటు వ్యక్తులు వచ్చి.. తక్కువ ధరకు ఎగ్జిబిషన్ నిర్వహించే తమ సొసైటీని కాదని వేలం పాట ద్వారా నిర్వహించాలని అడ్డుపడ్డారన్నారు. ప్రజలకు వినోదం పంచే ఎగ్జిబిషన్ విషయంలో వేలం పాట నిర్వహించి ఎగ్జిబిషన్ ను వ్యాపారం చేయొద్దని తాను కోరుతున్నట్లు భరత్ తెలిపారు. తమ సొసైటీలో తమతో పాటు జిల్లా కలెక్టర్, ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారన్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలన్నారు. ఎగ్జిబిషన్ కు వేలం పాట పెట్టకుండా తక్కువ ధరకు ప్రజలకు వినోదాన్ని అందిస్తున్న తమ సొసైటీ ద్వాారా నిర్వహించుకునేలా గతంలో అధికారులు ఇచ్చిన ఆదేశాలు యధావిధిగా అమలు చేసి తమకు ఎగ్జిబిషన్ నిర్వహించే అవకాశం కల్పించాలని తాను అధికారులను కోరుతున్నట్లు భరత్ తెలిపారు. ఎగ్జిబిషన్ విషయంలో అసలు ఏం జరుగుతుందన్న విషయాలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు ఆయన అన్నారు.