నవోదయ క్రీడాకారులను పరామర్శించిన డా. జంగం రాజేంద్రప్రసాద్..
1 min read– ఫుడ్ పాయిజన్ కు గల కారణాలపై ఆరా..
– బాలల హక్కులకు విఘాతం కలిగితే అధికారులపై చట్టపరమైన చర్యలు..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : పాయిజన్ అయ్యి చికిత్స పొందుతున్న నవోదయ జాతీయ క్రీడా బాల బాలికలను రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ సభ్యులు డాక్టర్ జంగం రాజేంద్రప్రసాద్ ప్రదర్శించారు. జవహర్ నవోదయ విద్యాలయ నందు శుక్రవారం ఫుడ్ పాయిజన్ కు గురై ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులను వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. నవోదయ ప్రిన్సిపల్ డాక్టర్ చంద్రశేఖర్ తో మాట్లాడి జరిగిన ఘటనపై వివరణ కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 193 మంది విద్యార్థులు క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా వివిధ రాష్ట్రాల నుంచి పెదవేగి నవోదయ విద్యాలయకు రావడం జరిగిందని, వీరులో 94 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యిందని తెలియజేశారు. హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి బాల బాలికలకు సరైన వైద్య సదుపాయాలు కల్పించాలని ఆదేశించారన్నారు. రాష్ట్రంలో బాలల హక్కులకు సంబంధించి విఘతం కలిగినట్లయితే సంబంధిత అధికారులకు చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిడబ్ల్యూసి చైర్మన్ బి రెబ్కారాని, డిసిపిఓ సూర్య చక్రవేణి, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.