PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మహిళలకు అన్ని విధాలా.. అండగా రాష్ట్ర ప్రభుత్వం

1 min read

– పొదుపు మహిళలకు వరుసగా నాల్గవ ఏడాది….”వైఎస్సార్ సున్నా వడ్డీ” పథకాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి.

– కర్నూలు జిల్లాలోని 41,642 స్వయం  సహాయక సంఘాలలోని అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.50.45 కోట్ల వడ్డీని బ్యాంకు ఖాతాల్లో జమ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన.

పల్లెవెలుగు వెబ్  కర్నూలు:  మహిళలకు అన్ని విధాలా అండగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిందని అందులో భాగంగానే ఈ రోజు పొదుపు సంఘాల మహిళలకు వరుసగా నాల్గవ ఏడాది… వైఎస్సార్ సున్నా వడ్డీ పథకాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రారంభించడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పేర్కొన్నారు.శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత గల  స్వయం సహాయక సంఘాలలోని అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో ఈ రోజు డా బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో బటన్ నొక్కి నేరుగా జమ చేసే బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు.స్థానిక కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి  జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, జడ్పి చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి, నగర్ మేయర్ బి వై రామయ్య, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, ఎమ్మెల్సీ మధుసూదన్ , డిఆర్డిఏ పిడి నాగశివలీల తదితరులు పాల్గొన్నారు.కలెక్టర్ మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని డిఆర్డిఏ, మెప్మా పరిధిలో 41,642 స్వయం  సహాయక సంఘాలలోని అక్కచెల్లెమ్మలు బ్యాంకులకు కట్టవలసిన రూ.50.45 కోట్ల వడ్డీని వారి తరపున పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. కర్నూలు జిల్లాకు సంబంధించి డిఆర్డీఏ (రూరల్) 29,814 స్వయం సహాయక సంఘాలకు రూ.31.91 కోట్లు, కర్నూలు జిల్లాకు సంబంధించి (మెప్మా) పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 11,828 స్వయం సహాయక సంఘాలకు రూ.18.54 కోట్ల వడ్డీ పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మల బ్యాంకు ఖాతాల్లో జమ చేశామన్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా, ప్రభుత్వమే వారి తరఫున వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని భరిస్తుందన్నారు. ఎంత వడ్డీ అవుతుందో అంత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా, వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధితో మహిళలు చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు.పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద  వడ్డీ భారం పడకుండా, ప్రభుత్వమే వారి తరుపున  వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని భరిస్తుందన్నారు. ఎంత వడ్డీ అవుతుందో అంత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నారన్నారు.  గ్రూపులో ఉన్న మహిళా సభ్యులు వారి ఖాతాల్లో జమ చేసిన వడ్డీ డబ్బులతో చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ  పెద్ద, పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు.కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్  మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలను లక్షాధికారులు చేయాలనే ఉద్దేశంతో మహిళల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని రాష్ట్రంలోని మహిళలు చిరునవ్వులతో ఉన్నప్పుడే ఆ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు, అందుకొరకే నిరుపేద మహిళల కొరకు గృహాలను, ఒంటరి మహిళలకు పింఛన్లను, ఇలా ఎన్నో రకాలుగా మహిళలను ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు.నగర మేయర్ బి వై రామయ్య మాట్లాడుతూ  21వ శతాబ్దంలో ప్రతి మహిళ ఆర్థికంగా ఎదగాలన్నదే  మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయమన్నారు. అందుకు అనుగుణంగా మహిళలు ఆర్దికంగా పుంజుకోవడం కోసం ఆసరా, సున్నా వడ్డీ, తదితర పథకాల ద్వారా మహిళలను ముందుకు నడిపిస్తున్నారని  అన్నారు.జిల్లా పరిష చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి మాట్లాడుతూ మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మహిళల పక్షపాతి అని మహిళల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని,  దేశంలో ఎక్కడ లేనివిధంగా రైతులకు, పిల్లలకు, వృద్ధులకు, మహిళల, కొరకు ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపిస్తున్నారని అన్నారు.అనంతరం జిల్లా కలెక్టర్, జెడ్పి చైర్మన్, కర్నూలు నగర మేయర్, పాణ్యం, కోడుమూరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ,డిఆర్డీఏ పిడిలు కలసి కర్నూలు జిల్లా (రూరల్) 29,814 స్వయం సహాయక సంఘాలకు రూ.31.91 కోట్లు, కర్నూలు జిల్లా (మెప్మా) పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ 11,828 స్వయం సహాయక సంఘాలకు రూ.18.54 కోట్ల వడ్డీకి సంబంధించి చెక్కును స్వయం సహాయక మహిళలకు అందజేశారు.

About Author