కిడ్నీలు, ప్రోస్టేట్ ఆరోగ్యం విషయంలో జాగ్రత్త
1 min read– ఇటీవల తరచుగా ప్రోస్టేట్ క్యాన్సర్ కేసులు
– 50 దాటాక ప్రతియేటా పరీక్షలు తప్పనిసరి
– బీపీ అదుపుతో కిడ్నీలు చాలావరకు సురక్షితం
– చింతలకుంటలో ఏఐఎన్యూ వైద్యుల సూచనలు
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ (ఎల్బీ నగర్) : ఇటీవలి కాలంలో తరచు ప్రోస్టేట్ సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తున్నాయని, వీటి విషయంలో ముందునుంచి అప్రమత్తంగా ఉంటూ తగిన వైద్య పరీక్షలు చేయించుకోవడమే మార్గమని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (ఏఐఎన్యూ) వైద్యులు సూచించారు. చింతలకుంటలోని వాసవీ శ్రీనిలయం గేటెడ్ కమ్యూనిటీలో ఆదివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అవగాహన శిబిరం నిర్వహించారు. దీనికి కమ్యూనిటీలో ఉన్న దాదాపు వంద మంది వరకు హాజరవ్వగా, అందరికీ ముందుగా పీఎస్ఏ (ప్రోస్టేట్ స్పెసిఫిక్ యాంటిజెన్) పరీక్షలు, సీరం క్రియాటినైన్ పరీక్షలు చేశారు. అనంతరం ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ యూరాలజిస్టు డాక్టర్ సుభాష్ చంద్రబోస్, కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ శ్రీకాంత్ ఈ అంశాలపై మాట్లాడి, కమ్యూనిటీ వాసులకు అవగాహన కలిగించారు. డాక్టర్ సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ, ‘‘మూత్రం సరిగా రాకపోవడం, పూర్తిగా ఆగిపోవడం, లేదా మూత్రంలో రక్తం కనిపించడం లాంటి సమస్యలు ఉంటే దాన్ని ప్రోస్టేట్ సమస్యగా గుర్తించాలి. తల్లిదండ్రుల్లో ఎవరికైనా ప్రోస్టేట్ క్యాన్సర్ ఉంటే పిల్లలకూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో 60 ఏళ్లు దాటినవారికి ఈ తరహా సమస్యలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్యాన్సర్ రావడానికి కారణం ఇదీ అని స్పష్టంగా చెప్పలేం. అయితే, పీఎస్ఏ పరీక్ష మాత్రం 50 ఏళ్లు దాటినవారంతా ఏడాదికోసారి తప్పనిసరిగా చేయించుకుంటే ప్రాథమిక దశలోనే వ్యాధిని గుర్తించి, తగిన చికిత్సలు చేయవచ్చు. కొందరిలో ప్రోస్టేట్ బాగా పెరిగిపోయి మూత్రవిసర్జనకు అడ్డుపడుతోంది. దీనికీ శస్త్రచికిత్స చేయాలి. అపోహల కారణంగా చికిత్సకు వెనుకాడటం తగదు. ముందస్తు చికిత్సతోనే సత్వర ఫలితాలు వస్తాయి అని సూచించారు. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్టు డాక్టర్ బి.శ్రీకాంత్ మాట్లాడుతూ, ‘‘కిడ్నీ జబ్బులు నానాటికీ పెరుగుతున్నాయి. భారతదేశంలో ప్రతి పది మందిలో ఒకరికి క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) ఉంటోందని అంచనా. ప్రతియేటా 2.30 లక్షల మంది డయాలసిస్ స్థాయికి వెళ్తున్నారు. అధిక రక్తపోటు, మధుమేహం వల్ల ఈ వ్యాధి ఎక్కువగా సంభవిస్తోంది. మధుమేహ బాధితులలో 40% మందికి కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. క్రానిక్ కిడ్నీ డిసీజ్ (సీకేడీ) లక్షణాలు చాలామందికి కనిపించవు. అవి తెలిసేసరికే వ్యాధి తీవ్రత పెరుగుతుంది. కిడ్నీ పనితీరు 50% పడిపోతేనే సీరం క్రియాటినైన్ కూడా పెరిగినట్లు చూపిస్తుంది. అప్పటివరకు అదీ మామూలుగానే ఉంటుంది. కొందరికి యూరిన్ ప్రోటీన్ టెస్ట్ తెలిస్తే ముందే వ్యాధి విషయాన్ని తెలుసుకోవచ్చు. బీపీ, షుగర్ ఉన్నవారు ప్రతియేటా సీరం క్రియాటినైన్, యూరిన్ ప్రోటీన్ టెస్ట్ చేయించుకోవాలి. లక్షణాలు లేకపోయినా చేయించుకోవడం మంచిది. దీనివల్ల వ్యాధిని ముందుగానే గుర్తించి, మందులు తీసుకుంటే డయాలసిస్ వరకు పోకుండా కాపాడుకోవచ్చు’’ అని వివరించారు.