డిపాల్ ఉన్నత పాఠశాలలో ఘనంగా స్వతంత్ర దినోత్సవ వేడుకలు
1 min readపల్లెవెలుగు వెబ్ ఆత్మకూరు: భారత 77వ స్వాతంత్ర వేడుకలను డిపాల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. డిపాల్ పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ జైసన్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించారు. జెండా వందనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కరివేన గ్రామ సర్పంచ్ మాణిక్యమ్మ హాజరై జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపల్ జైసన్ మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర కోసం ఎంతో మంది తమ ప్రాణాలను అర్పించారన్నారు. మహనీయుల త్యాగఫలముతోనే నేడు స్వతంత్రంగా జీవనం కొనసాగిస్తున్నామన్నారు. ప్రతి సంవత్సరం స్వతంత్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవంలను తమ పాఠశాలలో దేశభక్తి భావంతో నిర్వహిస్తున్నామన్నారు. తమ పాఠశాలలో విద్యతోపాటు సాంఘిక సంస్కరణలు, విద్య గొప్పతనం, సంస్కృతి సాంప్రదాయాలు, విలువలతో కూడిన జీవనం, ఉత్తమ భావిభారత పౌరులుగా మారటంపై విద్యార్థినీ విద్యార్థులకు అవగాహన కల్పిస్తామన్నారు. విద్య, క్రమశిక్షణ, చక్కని వాతావరణం, ఉత్తమ బోధనతో విద్యార్థల ఉత్తమ భవిష్యత్ కు బాటలు వేస్తున్నామన్నారు. స్వతంత్ర వేడుకల్లో భాగంగా విద్యార్థులతో మార్చ్ పాస్ట్, నృత్యాలు, పిరమిడ్ ఆకృతి, నాటికలు, స్వతంత్ర సమరయోధుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. స్వతంత్ర వేడుకల్లో పాల్గొన్న తమ పిల్లల ప్రదర్శనలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ ఫాదర్ వినీత్, ఫాదర్ షాంటో, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.