ప్రమాదాలకు నెలవుగా… పత్తికొండ.. ఆదోని రహదారి
1 min read– చోద్యం చూస్తున్న ఆర్ అండ్ బి అధికారులు
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే పత్తికొండ ఆదోని ప్రధాన రహదారిలో కూలిన బ్రిడ్జిలు ప్రమాదాలకు నెలవుగా మారుతున్నాయి. ప్రమాదాలను నివారించాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. సకాలంలో కూలిన వంతెనలపై ఏర్పడిన గుంతలను పూడ్చకపోవడంతో వాహనాలకు ప్రమాదాలు ఏర్పడి ప్రయాణికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. పత్తికొండ నుండి ఆదోనికి వెళ్లే ప్రధాన రహదారి శ్రీరామ ఆసుపత్రి వద్ద రోడ్డుపై నాసిరకంగా నిర్మించిన బ్రిడ్జి అనతి కాలంలోనే కూలిపోయి పెద్ద గోతి ఏర్పడింది. రోడ్డుకు మధ్యలో గోతి ఏర్పడడంతో, రాత్రి సమయాలలో వాహన చోదకులకు కానరాక వాహనాలు గోతిలో పడి ప్రమాదాలు జరుగుతున్నాయి. ద్విచక్ర వాహనదారులు సైతం గుంతలో పడి ప్రమాదాల బారిన పడుతున్నారు. కొందరు వాహనదారులు ప్రమాదాల బారిన పడి, తీవ్ర గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రధాన రహదారి మధ్యలో గుంత ఏర్పడి నెలలు కావస్తున్నా సంబంధిత ఆర్ అండ్ బి అధికారులు ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు కూలిపోయిన వంతెనను పునర్నిర్మించి ప్రమాదాలను నివారించాలని వాహన చోదకులు కోరుతున్నారు.