గూడెం కొట్టాల ప్రజల కష్టాలు తీరుస్తాం.. టిజి భరత్
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: గూడెం కొట్టాల ప్రజలకు 100 శాతం న్యాయం చేస్తామని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంఛార్జీ టిజి భరత్ అన్నారు. శుక్రవారం నగరంలోని 44వ వార్డు పరిధిలోని గూడెం కొట్టాలలో ఆయన భవిష్యత్తుకు గ్యారెంటీ పేరుతో ఇంటింటికి వెళ్లి ప్రజలను కలిశారు. ఈ సందర్భంగా ప్రజలు వారి ఇబ్బందులను టిజి భరత్ తో మొరపెట్టుకున్నారు. పగలంతా కరెంటు ఉండడం లేదని.. కేవలం రాత్రి మాత్రమే కరెంటు సప్లై చేస్తున్నారని చెప్పారు. అర్హులైనప్పటికీ పింఛన్లు అందడం లేదని, రోడ్లు, డ్రైనేజీలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం టీజీ భరత్ మాట్లాడుతూ కర్నూలు నగరంలో అత్యంత దుర్భరమైన జీవితం గడుపుతున్న ప్రాంతాల్లో గూడెం కొట్టాలు కూడా ఉందన్నారు. ఈ ప్రాంతంలో కరెంటు, రోడ్లు డ్రైనేజీ ఎలాంటివి లేకుండా ఏదో బతకాలంటే బతుకుతున్నట్టు ఇక్కడి ప్రజల పరిస్థితి ఉందన్నారు. యువగలం పాదయాత్ర సమయంలో నారా లోకేష్ వచ్చినప్పుడు వీరి పరిస్థితిని ఆయన దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గూడెం కొట్టాల ప్రజల సమస్యలపై దృష్టి పెడతామన్నారు. తాను ఎమ్మెల్యే అయ్యాక ఈ ప్రాంత ప్రజల కష్టాలను 100% తీరుస్తానని హామీ ఇస్తున్నట్టు చెప్పారు. ఈ ప్రాంత ప్రజలకు ఎలా న్యాయం చేయాలని ఇప్పటికే ఒక ప్రణాళిక తయారు చేసుకుంటున్నామని చెప్పారు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తుకు గ్యారెంటీ కరపత్రాలను ప్రజలకు అందించి టిడిపి అధికారంలోకి వస్తే ఎలాంటి పథకాలు అందుతాయో ప్రజలకు వివరించినట్లు భరత్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని కోరినట్లు చెప్పారు. గతంలో ఓటు వేసి గెలిపించుకున్న నేతలు ఇప్పటివరకు ఇక్కడి ప్రజల సమస్యలు పరిష్కరించలేదని.. కచ్చితంగా తనకు ఓటు వేసి గెలిపిస్తామని ప్రజలు హామీ ఇచ్చినట్లు టిజి భరత్ అన్నారు. ఓటు వేసే ముందు ప్రజలు కూడా ఆలోచించి అభివృద్ధి చేసే వ్యక్తిని ఎన్నుకోవాలని తాను కోరినట్లు చెప్పారు. అనంతరం గౌరి గోపాల్ వైద్యశాలలో ఉచితంగా చేయిస్తున్న వైద్య పరీక్షల కరపత్రాలు అందించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు హరి, జ్యోతి, ప్రభాకర్, కృష్ణవేణి, సురేందర్ రెడ్డి, రమేష్, వెంకటేష్, సుబ్రహ్మణ్యం, లోకేష్, యేసు, రాజశేఖర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.