మనిషి గుండెలో…‘ కుక్క బద్దె పురుగు తిత్తి’
1 min readశస్ర్త చికిత్సతో తొలగించిన ‘ గౌరి గోపాల్’ వైద్యులు
పల్లెవెలుగు, కర్నూలు: కలుషిత నీరు… ఉడికి ఉడకని మాంసం..ఆహారం.. తీసుకోవడం వల్ల ఓ మనిషి గుండెలో హైడాటెడ్ సిస్ట్ ( బుడగల వంటి తిత్తులు) ఏర్పడి ప్రాణానికే ప్రమాదం ఏర్పడింది. అది తెలియక గుండె నొప్పితో బాధపడుతూ .. కడపలోని కార్డియాలజిస్ట్ డా. వంశీ దగ్గరకు వెళ్లగా … రోగి గుండెలో హైడాటెడ్ సిస్ట్( బుడగల వంటి తిత్తులు) ఉన్నట్లు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలులోని గౌరిగోపాల్ ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. ఇక్కడ ఆపరేషన్ చేసి రోగిని కాపాడినట్లు కార్డియాలజి స్పెషలిస్ట్ డా. లక్ష్మణ స్వామి తెలిపారు. శనివారం గౌరిగోపాల్ హాస్పిటల్ ఛాంబరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కడప జిల్లా చింతకొమ్మ దిన్నె గ్రామానికి చెందిన 57 ఏళ్ల షేక్ మహబూబ్ బాష గత కొంత కాలంగా గుండె నొప్పితో బాధపడుతున్నాడు. కడపలోని కార్డియాలజిస్ట్ డా. వంశీ చికిత్స చేయగా ..గుండెలో హైడా టెడ్ సిస్ట్ లు ఉన్నాయని, మెరుగైన వైద్యం కోసం కర్నూలు గౌరి గోపాల్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. ఇక్కడ మెరుగైన చికిత్స చేయగా దాదాపు 50 హైడాటెడ్ సిస్ట్లు ఉన్నట్లు గుర్తించి… తొలగించారు. రోగి పూర్తిగా కోలుకున్నాడు.
జబ్బు.. అరుదు..
ఇది ఒక జునాటిక్ జబ్బు. జంతువుల జబ్బు మనుషులకు వస్తే… జునాటిక్ జబ్బు అంటారు. కుక్క పేగులో పెరిగే బద్దె పురుగు పెరిగి… వాటి జీవ పదార్థం కుక్క మలంలో విసర్జితమవుతాయి.ఆ మలంతో కలిసిన ఆకులు, కూరగాయలు, నీరు తాగడం వల్ల గొర్రెలకు ఈ ఇన్ఫెక్షన్ వస్తుంది. మనిషి అలాంటి కలుషితమైన ఆహారం.. నీరు, ఉడకని మాంసం తీసుకోవడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ మనిషికి సోకే ప్రమాదం ఉంది. సాదారణంగా ఈ ఇన్ఫెక్షన్ సోకి పదేళ్లైనా పేషెంట్ బాగానే ఉంటాడు. ఈ తిత్తులు సైజ్ పెరిగే కొద్ది రోగం బయటకు కనిపిస్తుంది. లివర్‌కు.. కొన్ని కేసులలో లంగ్స్/ ఊపిరితిత్తులకు, మెదడుకు ఈ తిత్తులు రావచ్చు. గుండెకు అరుదుగా వస్తుంది.
జబ్బు రాకుండా ఉండాలంటే..
- కలుషిత మాంసం, ఆహారం, నీరు తీసుకోరాదు.
- బాగా ఉడికించిన ఆహారం మాత్రమే తీసుకోవాలి.
- కుక్కలు పెంచే వారు తప్పనిసరిగా వాక్సిన్లు, డీ వర్మింగ్ ట్రీట్మెంట్ కుక్కలకు ఇప్పించాలి.