PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

మనిషి జీవితంలో వృద్ధాప్యం శాపంగా మారకూడదు

1 min read

– వృద్ధాప్యంలో ఉన్న వారిని ప్రతి ఒక్కరూ ఆదరించాలి

– ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజీస్ట్  డాక్టర్ శంకర శర్మ

పల్లెవెలుగు వెబ్ కర్నూలు:   ప్రతి మనిషి జీవితంలో వృద్ధాప్యం అన్నది తప్పనిసరిగా వస్తుందని, అయితే ఆ వృద్ధాప్యం ఎవరికి శాపంగా మారకూడదని ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ అన్నారు. కర్నూలు మండల పరిధిలోని బి తాండ్రపాడు గ్రామం వద్ద ఉన్న సెరుడ్స్ వృద్ధాశ్రమంలో జాతీయ వృద్ధాప్య దినోత్సవాన్ని పురస్కరించుకొని డాక్టర్ శంకర్ శర్మ నిత్యవసర వస్తువులను పంపిణీ చేశారు .ఈ కార్యక్రమంలో. నిర్వాహకులు జ్నానెశ్, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు .ఈ సందర్భంగా ప్రముఖ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ శంకర శర్మ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి తమ పిల్లలను పెంచుతారని ,అయితే వారు వృద్ధాప్యంలో చేరినప్పుడు పిల్లలు నిర్లక్ష్యం చేయకుండా ఆదరించాల్సిన అవసరం ఉందని వివరించారు. వృద్ధాప్యంలో ఉన్నవారికి పలు రకాల ఆరోగ్య సమస్యలు ఉంటాయని, వారిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. కొన్ని సందర్భాలలో పిల్లలు సుదూర ప్రాంతాలలో ఉండి తల్లిదండ్రులను దగ్గరకి తీసుకోలేని పరిస్థితి ఉంటుందని, మరికొన్ని సందర్భాలలో తల్లిదండ్రులే సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్వగ్రామాల్లో ఉండేందుకు ఇష్టపడుతున్నారని వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో వృద్ధులకు ఆశ్రయం కల్పించడానికి వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని వివరించారు. అయితే వృద్ధాశ్రమాల అవసరం రాకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు .ఎన్నో ఆరోగ్య సమస్యలతో పాటు పలు సమస్యలతో ఉన్న వృద్ధులను చేరదీసి  ఆదరించేందుకు వృద్ధాశ్రమాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని, ఇక్కడ డబ్బు కంటే వృద్ధులకు చేసే సేవలే కీలకమని చెప్పారు. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ సంపాదనలో ఎంతో కొంత భాగాన్ని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించాలని అప్పుడే నిజమైన  సంతృప్తి ఉంటుందని చెప్పారు. వృద్ధులను గౌరవించాలన్న ఆలోచనతోనే జాతీయ వృద్ధాప్య దినోత్సవ సందర్భంగా తాను వృద్ధాశ్రమానికి నిత్యవసర వస్తువులను పంపిణీ చేశానని, భవిష్యత్తులో కూడా తన సహకారం అందిస్తారని డాక్టర్ శంకర శర్మ స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ వృద్ధులను ఆదరించాలని మరోసారి ఆయన సూచించారు.

About Author