టార్గెట్… ఎస్సీ సెగ్మెంట్స్…!
1 min readకోడుమూరు, నందికొట్కూరు పై టీడీపీ ప్రత్యేక దృష్టి
- 40 ఏళ్ల లోపు యువతకే అధిక ప్రాధాన్యం..
- ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి.. మాండ్ర, గౌరు చెప్పిన వారికే టిక్కెట్..
- కోడుమూరులో పసుపుల దస్తగిరి, జయన్న , నందికొట్కూరులో గట్టు తిలక్, జయసూర్య పేర్లు విస్తృత ప్రచారం
- గెలుపు గుర్రాలపై… ఫోకస్ పెట్టిన అధిష్టానం
- సర్వేలపై…సర్వే చేయిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు
రానున్న ఎన్నికల్లో ..గెలుపే లక్ష్యంగా పనిచేసే రేసు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చేందుకు టీడీపీ అధిష్టానం గట్టి నిర్ణయం తీసుకుంది. ప్రజాదరణ..పనిచేసే సామర్థ్యం… అభ్యర్థి ఆలోచన తీరును బట్టి.. టిక్కెట్ ప్రకటించే అవకాశం ఉంది. కేసులకు భయపడకుండా.. అధికార వైసీపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లే సమర్థుడిని ఎంపిక చేసేందుకు టీడీపీ అధిష్ఠానం సర్వేలపై.. సర్వే చేయిస్తోంది. అభ్యర్థుల ఎంపికలో బీసీ, ఎస్సీ ఎస్టీ, ముస్లింలకు అధిక ప్రాధాన్యమిస్తూ… అధినేత చంద్రబాబు నాయుడు పక్కా ప్రణాళికతో ముందుకొస్తున్నట్లు పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
పల్లెవెలుగు:వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసేందుకు టీడీపీ అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేస్తోంది. 40 ఏళ్లలోపు యువతకే ప్రాధాన్యమిస్తామని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఇటీవల జిల్లాలో చేపట్టిన యువగళం పాదయాత్రలో బహిరంగంగానే చెప్పారు. అందులోనూ బీసీ ఎస్సీఎస్టీ ముస్లింలకు అధిక ప్రాధాన్యమిస్తామని చెప్పడంతో… ఉమ్మడి కర్నూలు జిల్లాలో కొత్త ముఖాలు తెరపై కనిపించే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఎస్సీ సెగ్మెంట్స్‌పై …ప్రత్యేక దృష్టి :
ఎన్నికలు ఏ సమయంలోనైన రావొచ్చని భావించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఒక్కొక్క సెగ్మెంట్‌కు అభ్యర్థిని ప్రకటిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఎస్సీ సెగ్మెంట్స్‌పై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. సెప్టెంబరు నెలాఖరిలోపు కోడుమూరు, నందికొట్కూరు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఇన్చార్జుల అభిప్రాయం.. ప్రజల మనోగతం… నాయకులు, కార్యకర్తల ఆశీర్వాదం ఎవరిపై ఉందనే విషయమై పార్టీ అధినేత పలు సర్వేలు చేయించినట్లు విశ్వసనీయ సమాచారం. వ్యక్తి నాయకత్వ లక్షణాలు, ధన,ప్రజాబలం… విద్య.. తదితరవి దృష్టిలో పెట్టుకుని అభ్యర్థిని ఎంపిక చేస్తారని జిల్లా నాయకులు పేర్కొంటున్నారు.
బలం…బలగం…:
ఉమ్మడి కర్నూలు జిల్లాలో కోడుమూరు, నందికొట్కూరు నియోజకవర్గాలు ఎస్సీలకు కేటాయించారు. కోడుమూరు బరిలో పసుపుల దస్తగిరి, జయన్న పేర్లు విస్తృత ప్రచారంలో ఉండగా… నందికొట్కూరులో గట్టు తిలక్, జయసూర్య పోటీలో నిలిచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అధినేత చంద్రబాబు నాయుడు, యువనేత నారా లోకేష్ కు జిల్లా పార్టీ పెద్దలతో చెప్పించినట్లు సమాచారం. ధన, ప్రజా బలంతోపాటు… కోడుమూరులో ఎదురూరు విష్ణువర్ధన్ రెడ్డి, నందికొట్కూరులో పార్లమెంట్ ఇన్చార్జ్ మాండ్ర శివానంద రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరు వెంకట రెడ్డి చెప్పిన వారికే టిక్కెట్ దక్కే అవకాశం ఉంది.
నందికొట్కూరు… గట్టు తిలక్ కేనా..?
నంద్యాల జిల్లా నందికొట్కూరు టీడీపీ అసెంబ్లీ టిక్కెట్ దాదాపు గట్టు తిలక్ కు కేటాయించే అవకాశం ఉందని విస్తృత ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యే ఆర్థర్, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అనుచరులను, మాజీ ఎమ్మెల్యే లబ్బి వెంకట స్వామిని ఎదుర్కొనే..ధీటైన యువకుడిని ఎంపిక చేసేందుకు టీడీపీ అధిష్ఠానం జిల్లా పెద్దలతో చర్చించినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో సీనియర్ నేత మాండ్ర శివానంద రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ గౌరు వెంకట రెడ్డి వీరవిధేయుడైన గట్టు తిలక్ పేరు ఖరారు కానున్నట్లు విశ్వసనీయ సమాచారం.