ఇంటింటి ఓటర్ల పరిశీలన.. నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలి
1 min read– పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గము ఎన్నికల నమోదు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: పాణ్యం నియోజకవర్గంలో ఇంటింటి ఓటర్ల పరిశీలన కార్యక్రమము భారత ఎన్నికల సంఘము వారు నిర్దేశించిన గడువులోపు పూర్తి చేయాలని పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గము ఎన్నికల నమోదు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు.శుక్రవారం కల్లూరు మండల కేంద్రంలోని సాయి శ్రీనివాస ఫంక్షన్ హాల్ నందు పాణ్యం నియోజకవర్గములోని పాణ్యం, గడివేముల, కల్లూరు మరియు ఓర్వకల్లు మండలాల సహాయ ఎన్నికల నమోదు అధికారులు (తహసిల్దారులు), సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారులతో పాణ్యం అసెంబ్లీ నియోజకవర్గము ఎన్నికల నమోదు అధికారి మరియు జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సమీక్షా సమావేశము మరియు శిక్షణ కార్యక్రమమును నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టరు మాట్లాడుతూ ఇంటింటి ఓటర్ల పరిశీలనలో వెనుకబడిన బూత్ లెవెల్ అధికారులు పరిశీలనలో పురోగతిని సాధించుటకు తగు సూచనలు ఇచ్చారు. ఇంటింటి ఓటర్ల పరిశీలన కార్యక్రమము భారత ఎన్నికల సంఘము నిర్ణయించిన గడువులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించే సమయానికి ఓటరు జాబితాలో ఉన్న ఏవైనా పొరపాట్లు అనగా ఇంటి నెంబరు, ఓటర్ల వయస్సు, ఒకే ఇంటి నెంబరు నందు 10 మందికి మించి ఓటర్లు ఉండుట లాంటి పొరపాట్లను సరిచేయాలనీ, మరణించిన ఓటర్లను, శాశ్వతముగా వేరే ప్రాంతాలకు తరలివెళ్లిన ఓటర్లను ఫారం-7 ద్వారా తొలగించాలనీ మరియు తేదీ 06.01.2023 నుండి 31.03.2023 వ తేదీల మధ్య తొలగించిన ఓట్లను పునఃపరిశీలించాలనీ సంబంధిత అధికారులను ఆదేశించారు. వివిధ ఫారములను ఏ విధముగా పరిశీలించాలి, విచారణ ఎలా చేయాలీ, ఆన్ లైన్ నందు వివిధ ఫారముల నమోదు ప్రక్రియ ఏ విధంగా చేయాలి అనే వాటి మీద జాయింట్ కలెక్టరు శిక్షణ ఇచ్చారు. పాణ్యం నియోజకవర్గమునకు సంబంధించి సరైన లింగ నిష్పత్తిని, జనాభా మరియు ఓటర్ల నిష్పత్తినీ, వయస్సుల సమిష్ఠి వారీగా ఓటర్ల నమోదును సాధించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో తహసిల్దార్లు సహాయ ఎన్నికల నమోదు అధికారులు, సూపర్వైజర్లు, బూత్ లెవెల్ అధికారుల తదితరులు పాల్గొన్నారు.