పాలకుల విధానాలు ప్రమాదకరం..
1 min read– సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య.
పల్లెవెలుగు వెబ్ పత్తికొండ: కేంద్రంలో నరేంద్ర మోడీ, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుసరిస్తున్న విధానాలు ప్రమాదకరంగా ఉన్నాయని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.రామచంద్రయ్య స్పష్టం చేశారు. మండలంలోని దూదేకొండ గ్రామంలో గురువారం రాత్రి ఏర్పాటుచేసిన సిపిఐ శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ప్రజల బాగోగులను ఏమాత్రం పట్టించుకోకుండా పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. పాలక ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల నిత్యావసర వస్తువుల ధరలు సామాన్య మానవులు కొనలేని విధంగా పెంచేశారని తెలిపారు. మోడీ అధికారంలోకి రాకముందు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని, విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తామని హామీలు ఇచ్చి, అధికారం చేపట్టి 9 ఏళ్ళు అయినా ఏ ఒక్క హామీని నెరవేర్చకపోగా, ప్రభుత్వ రంగ సంస్థలను కార్పోరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించారని దుయ్యపట్టారు. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలన అస్తవ్యస్తంగా తయారైందని సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ, అభివృద్ధిని ఏమాత్రం పట్టించుకోకుండా మోడీ అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను తూచా తప్పకుండా పాటిస్తున్నారని అన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకుందాం- దేశాన్ని కాపాడుకుందాం అనే నినాదంతో సిపిఐ చేపట్టిన బస్సు యాత్ర బహిరంగ సభ సెప్టెంబర్ రెండవ తేదీన పత్తికొండ లో పెద్ద ఎత్తున నిర్వహించడం జరుగుతుందని, అన్ని వర్గాల ప్రజలు, రైతులు, వ్యవసాయ కూలీలు, కార్మికులు, విద్యార్థి, యువజన సంఘాలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. సిపిఐ శాఖ కార్యదర్శి రాముడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఐ మండల కార్యదర్శి డి.రాజా సాహెబ్, పట్టణ కార్యదర్శి రామాంజనేయులు, జిల్లా సమితి సభ్యులు కారన్న, కృష్ణయ్య, పెద్ద ఈరన్న, ఆంజనేయ సంజప్ప సోమశేఖర్ పులికొండ గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.