ప్రభుత్వాలు.. క్రీడలకు ప్రాధాన్యమివ్వాలి : టి.జి భరత్
1 min readపల్లెవెలుగు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్ అన్నారు. నగరంలోని ఎస్.ఎల్.ఎన్ గార్డెన్లో నిర్వహించిన 11వ నేషనల్ లెవల్ ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్..2023 పోటీల ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఓవర్ ఆల్ ఛాంపియన్ గా మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్ జట్టు నిలవగా రెండవ స్థానంలో కర్ణాటక జట్టు నిలిచింది. విజేతలకు టి.జి భరత్ చేతుల మీదుగా ట్రోఫీలు అందించారు. అనంతరం టి.జి భరత్ మాట్లాడుతూ మన దేశంలో క్రీడలకు ప్రాధాన్యత లేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు క్రీడలకు ప్రాధాన్యత ఇస్తామని చెబుతున్నప్పటికీ చేసిందేమీ లేదన్నారు. బడ్జెట్ కేటాయింపులు ఉండవని, మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నారన్నారు. క్రీడల విషయానికొస్తే ఇతర దేశాలతో పోలిస్తే మనం సిగ్గు పడాల్సిన పరిస్థితి నెలకొందన్నారు. తమ వంతుగా తమ టిజివి గ్రూప్స్ నుండి క్రీడలకు అవసరమైన సహకారం అందిస్తున్నామని.. ప్రభుత్వాలు పట్టించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వేల కోట్ల రూపాయలు ఉన్న బీసీసీఐతో కేంద్ర ప్రభుత్వం చర్చిచి క్రికెట్ తో పాటు ఇతర క్రీడలను అభివృద్ధి చేసేందుకు ముందుకు వస్తే బాగుంటుందన్నారు. ఇక ఈ పోటీలు నిర్వహించిన జి.కె.ఎం.ఎ.ఏపీ అసోసియేషన్ నిర్వాహకులను ఆయన అభినందించారు. కర్నూల్లో చాలా అసోసియేషన్లు ఉన్నప్పటికీ క్రీడల నిర్వహణలో వీరు మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ టీం కోచ్ కీర్తన్, నేషనల్ బాడీ ప్రెసిడెంట్ ప్రేమ్, స్టేట్ బాడీ మెంబర్స్ హరి కిషన్, మహబూబ్, గోపి, నిర్వాహకులు జగదీష్, క్రీడాకారులు పాల్గొన్నారు.