కొబ్బరి కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి..
1 min read– ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్..
పల్లెవెలుగు వెబ్ ఏలూరు జిల్లా : కొబ్బరి కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరచి నష్టపోతున్న కొబ్బరి రైతులను ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు.స్థానిక పవర్ పేట లోని అన్నే భవనంలో ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షులు బొల్లి రామకృష్ణ అధ్యక్షతన మంగళవారం కొబ్బరి రైతుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కొబ్బరి రైతుల సమస్యల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదన్నారు. జిల్లాలో 35 వేల ఎకరాలలో కొబ్బరి తోటల విస్తీర్ణం ఉందని చెప్పారు. కొబ్బరికాయలకు కనీస ధరలు రాక కొబ్బరి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కొబ్బరి చెట్ల నుండి రాలిన కాయలు గుట్టగా పోయడానికి అయ్యే ఖర్చులు కూడా రాకపోవడంతో తోటల్లోనే ఉంచివేయడంతో మొలకలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం రైతులకు కొబ్బరికాయకు రూ.5 నుండి రూ.6 మాత్రమే ధర మాత్రమే వస్తోందన్నారు. వినియోగదారులకు మాత్రం నాణ్యమైన కొబ్బరికాయను రూ.30 పైగా అమ్ముతున్నారని అన్నారు. ఎర్ర నల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్లు వలన దిగుబడులు తగ్గిపోయాయని చెప్పారు. కొబ్బరికాయలు చెట్టు నుండి కోసుకునేందుకు వ్యాపారులు గత ఏడాది వరకు రూ.1000 నుండి రూ.1200 వరకు ధర ఇచ్చేవారని, ప్రస్తుతం రూ.600 నుండి రూ.700 మాత్రమే ఇస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం విదేశీ కొబ్బరి ఉత్పత్తుల దిగుమతులకు అనుమతులు ఇవ్వడం వలన దేశీయ మార్కెట్ లో కొబ్బరికి ధర పడిపోయిందని చెప్పారు. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలు రాని సమయంలో ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింప చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా చెబుతున్నా ఆచరణలో అమలు లేదని విమర్శించారు. ఎకరా కొబ్బరి సాగుకు సంవత్సరానికి రూ.40 వేలకు పైగా ఖర్చు అవుతుందన్నదని కనీస పెట్టుబడి ఖర్చులు కూడా రాక నష్టాల్లో కూరుకుపోతున్న కొబ్బరి రైతులను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నాఫెడ్, ఆయిల్ ఫెడ్ లను వెంటనే రంగంలోకి దింపి కొబ్బరి కొనుగోలు కేంద్రాలు తెరవాలని కోరారు. కొబ్బరి రైతులకు ధరల స్థిరీకరణ నిధి పథకం వర్తింపజేయాలన్నారు. విదేశీ కొబ్బరి దిగుమతులను నిషేధించాలని కోరారు. జిల్లాలో కొబ్బరి ఆధారిత పరిశ్రమలను సహకార రంగంలో ఏర్పాటు చేయాలన్నారు. ఎర్ర నల్లి, తెల్ల దోమ వంటి తెగుళ్ల నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ పరికరాలు అందించాలని, ఉద్యాన శాఖ ద్వారా సబ్సిడీ పథకాలు అమలు చేయాలని కోరారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించవద్దని, ఉచిత విద్యుత్ పథకాన్ని యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.ఈ సమావేశంలో పి. అచ్యుతరామయ్య,జి.రమేష్ రెడ్డి పలువురు కొబ్బరి రైతులు పాల్గొన్నారు.