గరికపాటి రాజారావు ఆశయాలను కొనసాగిస్తాం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: గరికపాటి రాజారావు ఆశయాలను కొనసాగిస్తామని ప్రజానాట్యమండలి మండల కార్యదర్శి వై రమేష్ జిల్లా నాయకులు అడ్వకేట్ కాశీ విశ్వనాథ్ రాముడు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కామ్రేడ్ ఈశ్వర్ రెడ్డి భవనం నందు ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో గరికపాటి రాజారావు 60 వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రజా కళాకారులు గరికపాటి రాజారావు అందరికీ ఆదర్శనీయులని అన్నారు.కళ కళ కోసం కాదు ప్రజలకోసమని, ప్రజా చైతన్యం కోసమని సమాజానికి చాటి చెప్పిన ప్రజా కళాకారుడు గరికపాటి రాజారావు అని కొనియాడారు. ఆ రోజుల్లో మాభూమి, అల్లూరి సీతారామరాజు అనేక నాటికల ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ, స్వాతంత్రోద్యమంలో యువతను ప్రజా ఉద్యమాల వైపు ప్రేరేపించారన్నారు. ప్రజానాట్యమండలి ద్వారా సామాజిక చైతన్యం కోసం ప్రజా కళాకారులు గరికపాటి పరితపించారని అన్నారు. ఆయన ఆశయాల కోసం కృషి చేస్తామని వారు తెలిపారు. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో హోసూరు ప్రజా కళాకారుడు గాయకుడు డోలక్ శివ ను శాలువా, పూలమాలతో సత్కరించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయన ప్రజా కలలను ప్రతిభను గుర్తిస్తూ, ఆయనకు నంది బంగారు పతాకం అవార్డుకు ఎంపిక అయినందుకు గాను సన్మానించినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు దస్తగిరి, వెంకటేశ్వర రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు మధు, ,నరసింహ, ఆవాజ్ కమిటీ మండల కార్యదర్శి తాజ్ మహమ్మద్, ప్రజానాట్యమండలి హోసూరు, పుచ్చకాయలమాడ శాఖల సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.