పత్తికొండలో బందు విజయవంతం
1 min readపల్లెవెలుగు వెబ్ పత్తికొండ: మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా టిడిపి ఇచ్చిన రాష్ట్ర బంద్ పిలుపు మేరకు సోమవారం పత్తికొండలో బందు విజయవంతమైంది. ఉదయం నుండి టిడిపి శ్రేణులు పట్టణంలోని రోడ్లపైకి వచ్చి నిరసన ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. స్థానిక మార్కెట్ యార్డు వద్ద ఎన్టీఆర్ సర్కిల్ టిడిపి నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్డుపై బైఠాయించారు. దీంతో రోడ్లపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆందోళన చేస్తున్న టిడిపి నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయినప్పటికీ టిడిపి శ్రేణులు ప్రధాన రహదారి గుండా చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ర్యాలీలు చేశారు. అనంతరం నాలుగు స్తంభాల కూడలి వద్ద ఆర్టీసీ బస్టాండు ఆదోని కర్నూలు రహదారుల్లో కార్యకర్తలు చేరుకొని బస్సులను వాహనాలను అడ్డగించారు. ఈ సందర్భంగా టిడిపి జిల్లా ఉపాధ్యక్షులు కే సాంబశివరెడ్డి రామ నాయుడు తిరుపాలు తిమ్మయ్య చౌదరి అశోక్ కుమార్ సింగం శ్రీనివాసులు నిరసనకారులకు మద్దతుగా వారితో కలియతిరిగారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ను ఎలాగైనా కేసులో ఇరికించి ఆయన పరపతిని తగ్గించేందుకు ప్రభుత్వం కుట్ర పండుతుందని అన్నారు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా మచ్చలేని నాయకుడుగా పాలన సాగించారన్నారు. ఇప్పుడు ప్రభుత్వం చంద్రబాబుపై మోపిన అభియోగాలు ఏమాత్రం రుజువు కావని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పంతాలకు పోయి తమ నాయకుడిని అవినీతిపరుడుగా చిత్రీకరించే ప్రయత్నాలు సాగవని అన్నారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం కాగా నియోజకవర్గంలోని అన్ని మండలాల ప్రజలు వ్యాపారులు ఉద్యోగులు స్వచ్ఛందంగా బందును పాటించాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల టిడిపి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.