జగనన్నకు చెబుదాం స్పందనకు 94 అర్జీలు
1 min read– సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ వహించాలి
– అర్జీదారులకు సత్వర పరిష్కారం అందించాలి
– జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : అర్జీదారుల సమస్యల పట్ల సకాలంలో స్పందించి నిర్ణీత గడువులోగా సంతృప్తికర స్దాయిలో పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ అధికారులను ఆదేశించారు. సోమవారం స్ధానిక కలెక్టరేట్ గౌతమీ సమావేశ మందిరంలో నిర్వహించిన సమస్యల పరిష్కార వేదిక జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్, జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి, ఇన్ చార్జి డిఆర్ఓ సూర్యనారాయణరెడ్డి, జెడ్పి సిఇఓ కె. రవికుమార్, ఏలూరు ఆర్డిఓ ఎస్ కె ఖాజావలీ,జిఎస్ డబ్ల్యూఎస్ నోడల్ అధికారి రమణ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జి.వి.వి. సత్యనారాయణమూర్తి, అర్జీదారుల నుంచి 94 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వె.ప్రసన్న వెంకటేష్ మాట్లాడుతూ అర్జీదారుడు సంతృప్తిచెందేలా నిర్ణీత గడువులోపు నాణ్యతతో కూడిన రీతిలో పూర్తిస్ధాయి పరిష్కారం చూపాలన్నారు. ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్రస్ధాయిలో క్షుణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. పెండింగ్, బియాండ్ ఎస్ఎల్ఎ, రీఓపెనింగ్ లేకుండా అర్దీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ బి. లావణ్యవేణి మాట్లాడుతూ రీసర్వే మూడవ విడత, స్టోన్ ప్లాంటేషన్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ అంశాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అసైన్డ్ ల్యాండ్ ఇనామ్ భూములకు సంబంధించిన అంశాలను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. పెదవేగి మండలం నడిపల్లి గ్రామానికి చెందిన యం.నారాయణరావు తమ జాయింట్ భూమికి ఒకవాటాకు పట్టాదారు పాస్ పుస్తకం ఇప్పించాలని కోరుతూ అర్జీ అందజేశారు. బుట్టాయిగూడెం మండలం జైన్ వారి గూడెం కు చెందిన కె. కృష్ణకుమారి తమతల్లి గారిచ్చిన పసుపు కుంకుమ భూమిని ఇతరులు ఆక్రమించుకొని భూమిని దున్నుతున్నారని వారిపై చర్యలు తీసుకొని తన భూమిని తనకు ఇప్పించాలని కోరారు. ఉంగుటూరు మండలం తాళ్లపురం గ్రామానికి చెందిన కె. శ్రీను తమ భూమిని సర్వే చేయాలని కోరుతూ అర్జీ అందజేశారు. మండవల్లి మండలం లోకమూడి గ్రామానికి చెందిన కుసుమకుమారి తమ కుమారుడు డాక్టర్ చదువుకు ఇంటిని తాకట్టుపెట్టుటకు రిజిస్ట్రేషన్ చేయడానికి సంబంధిత అధికారులు నిరాకరించినందుకు పరిష్కారం చూపమని అర్జీ అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.