PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

బాల్యవివాహాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోండి

1 min read

కమిటీలు చురుకుగా వ్యవహరించాలి

జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్

పల్లెవెలుగు వెబ్ నంద్యాల: బాల్య వివాహ నిరోధక చట్టాన్ని జిల్లాలో పటిష్టంగా అమలుచేసి బాల్య వివాహాల నియంత్రణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని  జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ కమిటీ సభ్యులను, సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ బాల్య వివాహాల నిరోధక చట్టంపై వివిధ శాఖల అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ సమావేశంలో జిల్లా కలెక్టర్ తో పాటు జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ బాల్య వివాహాల నియంత్రణకు ఏర్పాటు చేసిన గ్రామ, పట్టణ స్థాయి కమిటీలు చురుకుగా వ్యవహరించి అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి గ్రామంలో సచివాలయ సిబ్బందితో పాటు అందుబాటులో ఉన్న మానవ వనరులను వినియోగించుకుని బాల్య వివాహాలు జరిగే ప్రదేశాలను గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 18 సంవత్సరాల్లోపు వున్న పిల్లల జాబితా అన్ని పాఠశాలల్లో అందుబాటులో ఉందని సచివాలయ సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలను వ్యతిరేకించిందేకు విద్యావంతులు, మేధావులు, మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలను భాగస్వామ్యం చేసి అరికట్టేందుకు చర్యలు తీసుకోవడంతో పాటు సంపూర్ణ అవగాహన కల్పించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో బాల్య వివాహాలు జరిగే గ్రామాలు, వీటికి గల మూల కారణాలను అన్వేషించి వ్యవస్థను సరిచేసేందుకు కమిటీ సభ్యులు కృషి చేయాలన్నారు. చిన్న వయస్సులోనే వివాహాలు చేయడం వలన పిల్లలు మానసికంగా, శారీరకంగా ఇబ్బంది పడే అంశాలపై తల్లిదండ్రులకు సంపూర్ణ అవగాహన కల్పించాలన్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే సంబంధిత సమాచారాన్ని చేరవేసే మెకానిజాన్ని పకడ్బందీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. బాల్య వివాహాలను నివారించడం ద్వారా మాతా,శిశు మరణాలు తగ్గుముఖం పడతాయన్నారు. బాల్య వివాహాలు జరిపితే శిక్ష అనేది ఒక భాగం మాత్రమేనని… ఇందుకు తగ్గ కౌన్సిలింగే ప్రధానమని పక్కాగా నిర్వహిస్తే సులభంగా అరికట్టవచ్చని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లా ఎస్పీ కె. రఘువీర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో నెట్వర్క్ ఉన్న నేపథ్యంలో బాల్య వివాహాలు జరుగుతున్న కమ్యూనిటీ వర్గాలను గుర్తించి అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా సుగాలి, చెంచు, బుడగజంగాలు తదితర వర్గాల్లో ఫోకస్ పెట్టి నియంత్రించాలన్నారు. అనంతరం బాల్య వివాహాల నిషేధ చట్టం వాల్పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు జుబేదా బేగం, మహిళా శిశు సంక్షేమ శాఖ పీడీ నిర్మల, బాలల సంరక్షణాధికారి శారద, సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

About Author