ఘనంగా…ఈశ్వరచంద్ర విద్యాసాగర్ 203వ జయంతి
1 min readపల్లెవెలుగు వెబ్ కర్నూలు: AIDSO – AIMSS – AIDYO సంఘాల ఆధ్వర్యంలో మహోన్నత మానవతావాది, ఆధునిక భావాల ఆద్యుడు, భారత నవజాగరణోద్యమ వైతాళికులు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ యొక్క 203వ జయంతి సందర్భంగా సేవ్ ఎడ్యుకేషన్ – సేవ్ కల్చర్ అనే అంశంపై కర్నూల్ నగరంలోని టిజివి కళాక్షేత్రం నందు సదస్సును నిర్వహించారు.ఈ సదస్సుకు ఏఐడిఎస్ఓ రాష్ట్ర అధ్యక్షులు వి.హరీష్ కుమార్ రెడ్డి అధ్యక్షత వహించారు. ముందుగా విద్యాసాగర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.కార్యక్రమంలో ముందుగా మానవ హక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎ.చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ – 19వ శతాబ్దంలో ఉన్న మత ఛాందసవాదం, పాత మూఢవిశ్వాసాలకు వ్యతిరేకంగా మహిళల విద్యకై, వితంతు పునర్వివాహాలకై పోరాటం చేపట్టిన గొప్ప సంఘ సంస్కర్త ఈశ్వర చంద్ర విద్యాసాగర్ అని కొనియాడారు… అంతేకాకుండా ఆధునిక విద్య కొరకై శాస్త్రీయ లౌకిక ప్రజాతంత్ర విద్యా విధానానికై కృషి చేశారని, అందుకే విద్యాసాగరుడుగా కొనియాడారని తెలిపారు. కాని నేడు మనం చదువుతున్న విద్యలో విజ్ఞాన శాస్త్రాల అసలు సారమైన శాస్త్రీయ ఆలోచనలను తర్క వివేచనను తొలగించి కేవలం సాంకేతిక సమాచారాన్ని మాత్రమే నేడు బోధించడం జరుగుతుందని చెప్పారు. ప్రస్తుతం నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా మన రాష్ట్రంలో 3,4,5 తరగతులను హైస్కూల్ కు విలీనం చేయడం, 1,2 తరగతులను అంగన్వాడీలకు పంపడం పూర్తిగా అప్రజాస్వామికమైనదని, అంతేకాకుండా పేద విద్యార్థులకు చదువు మరింత దూరం అవుతుందని దుయ్యబట్టారు. ఉన్నత విద్య అయిన డిగ్రీ విద్యలో ప్రవేశపెట్టిన సింగిల్ మేజర్ సబ్జెక్ట్ నాలుగు సంవత్సరాల డిగ్రీ కోర్సు అంటూ విద్య యొక్క అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తూ, తూతుమంత్రంగా కొన్ని స్కిల్స్ నేర్పించి, చీప్ లేబర్ గా తయారు చేయడం తప్ప ఇంకోటి లేదని అన్నారు.అనంతరం ఆల్ ఇండియా సేవ్ ఎడ్యుకేషన్ కమిటి రాష్ట్ర కార్యదర్శి ఎస్. గోవిందరాజులు మాట్లాడుతూ – విద్యాసాగర్ యొక్క గొప్పతనాన్ని గుర్తు చేస్తూ 150వ సంవత్సరాల క్రితం ఉన్న సనాతన ఆచారాలుగా కొనసాగుతున్న మహిళల వివక్ష, పాత మూఢభావాలు, కుల వివక్షకు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని చేపట్టారు… దాని స్థానంలో ఉన్నత సంస్కృతీ, విలువల కొరకు ఎంతో గాను కృషి చేశారు… కాని ఈరోజు తిరిగి మరీ అవే పాత మూఢాచారాలను, కుల, మత ఉన్మాదాన్ని, గ్రుడ్డితత్వాన్ని, విద్యార్థులు, యువకులు చెడు వ్యసనాలకు బానిసలుగా మారేలా మన పాలకుల విధానాలు ఉన్నాయని అన్నారు… ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థులు, యువకులు ఇలాంటి గొప్ప వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లినప్పుడు మాత్రమే అన్యాయాలకు, అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడగలరని, అప్పుడు మాత్రమే అసమానతలు లేని సమాజాన్ని నిర్మించగలరని పిలుపునిచ్చారు.చివరగా AIMSS రాష్ట్ర కార్యదర్శి ఎం.తేజోవతి మహిళల సమస్యలు, వాటి పరిష్కారాల గురించి వివరించారు.అనంతరం టిజివి కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య చేతుల మీదుగా విద్యార్థులకు బహుమతులు అందజేశారు… చివరగా విద్యార్థులతో నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలతో సదస్సును ముగించారు.కార్యక్రమంలో AIDSO నగర కార్యదర్శి హెచ్. మల్లేష్, AIMSS నగర నాయకులు సంధ్య, రోజా, సభ్యులు భార్గవ్, పవన్, రాజేష్, వంశి, శివ, భరత్ తదితరులు పాల్గొన్నారు.