అయోమయంలో…. రైతులు..
1 min readపల్లెవెలుగు వెబ్ నంద్యాల : తుంగభద్ర, కృష్ణా నది నీటి ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేని సందర్భంలో ఈ సంవత్సరం రెండవ సారి, లేదా రబీ వ్యవసాయానికి సంబంధించిన సాగునీటి సలహా మండలి సమావేశం ఈ నెల 15 న ఏర్పాటు చేసినందుకు మండలి ఛైర్మన్, కలెక్టర్ కి రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి అభినందనలు తెలిపారు.సాగునీటి సలహా మండలి సమావేశంలో తీసుకునే నిర్ణయాలు రైతులు, రైతు కూలీలు, గ్రామీణ ప్రజల జీవితాలతో ముడిపడి ఉన్నందున శాస్త్రీయ శాస్త్రీయ, సాంకేతిక, గణాంక దృక్పథంతో నిర్ణయాల కోసం నంద్యాల జిల్లా కలెక్టర్ కి దశరథరామిరెడ్డి ఉత్తరం వ్రాసారు.వ్యవసాయ అనుకూల రుతువు ప్రారంభం కాగానే రైతులు వ్యవసాయ పనులు మొదలు పెట్టడం సహజమనీ, దీనితో జిల్లా వ్యాప్తంగా అనేక వేల ఎకరాలలో సాలు వరి విత్తనం వేయడమో లేదా వరి నాట్లు వేయడమో జరిగిందని ఆయన తెలిపారు.ఈ సంవత్సరం కృష్ణా నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉండటంతో శ్రీశైలం రిజర్వాయర్ లో నీటి లభ్యతను బట్టి పంట పొలాలకు నీరు అందిస్తామని మొదటి (ఖరీఫ్) సాగునీటి సలహా మండలి సమావేశంలో నిర్ణయించారని అన్నారు. తదనంతరం ప్రజాప్రతినిధులు పోతిరెడ్డిపాడు గేట్లు ఎత్తే కార్యక్రమాన్ని పండుగలాగా జరిపి రైతుల పొలాలకు ఏ పంటకైనా నీరు అందిస్తామనే వాతావరణాన్ని కల్పించడంతో వరి పంటను ఉంచాలా? దున్నేసి రబీ పంటలకు పొలాలను సిద్దం చేసుకోవాలా? అర్థంగాక రైతులు అయోమయంలో పడ్డారని తెలిపారు.ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 15 న ఏర్పాటు చేసిన సలహామండలి సమావేశం ఏర్పాటు చేసారని, ఈ సమావేశంలో జరిగిన తీరు, చర్చలు, తీసుకున్న నిర్ణయాలపై కొన్ని అంశాలు మా దృష్టికి వచ్చాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఏ ఏ పంటలు ఉన్నాయి, రబీ పంట విత్తనం ఎన్ని ఎకరాలలో జరిగింది, ఎన్ని ఎకరాలలో ఎప్పుడు జరగబోతుంది, వీటికి నీటి అవసరాలు ఏ ఏ సమయాల్లో, ఎంత పరిమాణంలో కావాలి తదితర శాస్త్రీయ, సాంకేతిక, గణాంక విశ్లేషణ సమావేశంలో జరగలేదు.శ్రీశైలం రిజర్వాయర్ నుండి రాయలసీమ ప్రాజెక్టులు నీరు పొందడానికి, రిజర్వాయర్ నుండి విద్యుత్ ఉత్పత్తి నిలుపుదల అంశం, కె సి కెనాల్ కున్న ఏకైక రిజర్వాయర్ అలగనూరు మరమ్మతులకు సంబంధించిన ప్రతిపాదనలకు రెండు సంవత్సరాలైనా ప్రభుత్వ అనుమతులు రాకపోవడం, నిధులు విడుదల చేయకపోవడం, కె సి కెనాల్ పరిరక్షణకు గుండ్రేవుల రిజర్వాయర్ రిజర్వాయర్ నిర్మాణం తదితర అనేక కీలక అంశాలపై సమగ్ర చర్చ జరపి, తీర్మానాలు చేయలేదు.నీటి లభ్యత, పంటలకు నీటి ఆవశ్యకత ఎప్పుడు అన్న శాస్త్రీయ దృక్పథంతో కాకుండా ఈ కాలువకు ఇన్ని, ఆ చెరువుకు అన్ని నీళ్ళు విడుదల చేయండనే నిర్ణయాలు.రైతులతో మాట్లడటం అటుంచి, రైతులను సమావేశం నుండి బయటకు పోవాలని ఆదేశించడం.ప్రజా ప్రతినిధులకున్న పరిమితులతో సాగునీటి సలహామండలి సమావేశాలలో అనేక సలహాలు చేయడం పరిపాటి అని పేర్కొంటూ, వారి సలహాలు చాలా సందర్భాల్లో పండితే మా గొప్ప, ఎండితే మీ కర్మ అన్న రీతిలో తీసుకున్నవే అని వివరించారు. ఈ సమావేశం నిర్ణయాలు రైతుల, రైతు కూలీల, గ్రామీణ ప్రజల జీవితాలకు సంబంధించినవి అని మీకు వివరించాల్సిన అవసరంలేదని భావిస్తున్నామని ఆయన అన్నారు. సలహామండలి సమావేశంలో చేసిన పైన వివరించిన అసమగ్ర చర్చలు, తీర్మానాలు రైతుల జీవితాలను గాలిలో దీపంలాగా పెట్టే విధంగా ఉన్న విషయం మీకు తెలియందు కాదని ఆయన అన్నారు.ఈ నేపథ్యంలో సలహామండలి చైర్మన్ గా సరైనా దిశా నిర్దేశం చేసే విధంగా స్పష్టంగా శాస్త్రీయ, సాంకేతిక, గణాంక వివరాలను పరిగణలోనికి తీసుకొని నీటి విడుదలకు సంబంధించిన స్పష్టమైన పత్రం విడుదల చేయాలని విజ్ఞప్తి చేస్తున్నామనీ, అదే సందర్భంలో పంటలు వేసి నీరందక (కాలువల లేదా వర్షాధారంగా) నష్టపోయిన రైతులందరికీ పంట నష్టపరిహారం అందించడానికి ప్రతిపాదనలను తయారుచేసి ప్రభుత్వానికి పంపి అనుమతులు సాధించాలని దశరథరామిరెడ్డి కలెక్టర్ కు విజ్ఞప్తి చేసారు.