అక్టోబర్ 2న విజయవాడ లో సేవ్ జర్నలిజం రౌండ్ టేబుల్
1 min read – 8న ఏపీయూడబ్ల్యూజే నూతన కార్యవర్గ ఎన్నిక*
పల్లెవెలుగు వెబ్ విజయవాడ : ఐజేయూ పిలుపు మేరకు అక్టోబర్ 2న సేవ్ జర్నలిజం పై వివిధ రంగాలకు చెందిన మేధావులతో విజయవాడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని ఏపీయూడబ్ల్యూజే విజయవాడ, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యవర్గ సమావేశం నిర్ణయించింది. ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షులు చావా రవి అధ్యక్షతన బుధవారం ప్రెస్ క్లబ్లో జరిగిన ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు ఐవీ సుబ్బారావు గారు, ప్రధాన కార్యదర్శి చందుజనార్ధన్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా పత్రికా స్వేచ్ఛకు తీవ్ర ముప్పు ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక భూమిక పోషించే మీడియా స్వేచ్ఛ ను కాపాడాలని కోరుతూ ఇటీవల పాట్నాలో జరిగిన ఐజేయూ కార్యవర్గం అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా ‘సేవ్ జర్నలిజం డే ‘ నిర్వహించాలని తీర్మానం చేసినట్లు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఆ రోజు ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని వారు పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో తొలుత దివంగత ఐజేయూనేత అంబటి ఆంజనేయులకు ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ రెండు నిముషాల పాటు మౌనం పాటించారు. అక్టోబర్ 8 న ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్, ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికలు నిర్వహించాలని సమావేశం ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో ఐజేయూ కార్యవర్గ సభ్యులు ఎస్కే బాబు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె జయరాజ్, విజయవాడ యూనిట్ కార్యదర్శి కొండా రాజేశ్వరరావు, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నిమ్మరాజు చలపతిరావు, కార్యదర్శి ఆర్ వసంత్ లతో పాటు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు దారం వెంకటేశ్వరరావు, దాసరి నాగరాజు, జి రామారావు, సామ్నా రాష్ట్ర అధ్యక్షులు సీహెచ్ రమణారెడ్డి, విజయవాడ అధ్యక్షులు ఎంవీ సుబ్బారావు యూనియన్, ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.