పీసీసీ అధ్యక్షుడు.. ఆయనేనా ?
1 min readపల్లెవెలుగు వెబ్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తీనే కాలేదు. అయినా సరే నేనంటే..నేను అని కాంగ్రెస్ నేతలు ప్రకటనలు జారీ చేస్తున్నారు. ఎవరనేది ఇంకా అధిష్టానం తేల్చలేదు. తెలంగాణలో మాత్రం నాకంటే మించినోడు లేడన్న ప్రకటనలు చేస్తున్నారు. పీసీసీ బంతి సోనియా కోర్టులోకి వెళ్లిందని సమాచారం. ఆమె ఎవరిని ఎంపిక చేస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అంత వరకు కూడ తెలంగాణ నేతలు ఆగేలా లేరు. పీసీసీ పదవి తనకే దక్కుతుందని, కేసీఆర్ ను దించే మెడిసన్ తన వద్దే ఉందని సంగారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ప్రకటన చేశారు. తనను గుర్తించకపోవడం దారుణమని, కేసీఆర్ ను తెలంగాణ ఉద్యమ సమయంలో బలంగా ఎదుర్కొంది తనే అని చెబుతున్నారు. ఏఐసీసీ నేత మాణిక్యం ఠాగోర్ కు ఇది తెలియకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఏది ఏమైన క్రమ శిక్షణ గల పార్టీ కార్యకర్తగా .. హైకమాండ్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని తెలిపారు.
‘నేనే పీసీసీ అధ్యక్షుడు ’: పీసీసీ తనకే వస్తుందని మరో నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రేవంత్ రెడ్డి మద్దతు, పార్టీ సీనియర్ల మద్దతు తనకే ఉందని ఆయన చెప్పారు. పదవి వచ్చినా.. రాకున్నా పార్టీలోనే కొనసాగుతానని తెలిపారు. తన తమ్ముడు పార్టీ వీడటం ఆయన వ్యక్తిగతమని తెలిపారు. సీఎం కేసీఆర్ అన్న కూతురు కూడ వేరే పార్టీలో ఉన్నారు కదా అని అన్నారు.
నెలలో పీసీసీ ఎంపిక పూర్తీ: పీసీసీ ఎంపిక సోనియా గాంధీ చేతుల్లో ఉందని, ఒక నెలలో ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని ఏఐసీసీ నేత మధు యాష్కీ గౌడ్ పేర్కొన్నారు. టీపీసీసీ బడుగు, బలహీన వర్గాల వారికి ఇవ్వాలని, తానూ రేసులో ఉన్నానని మధుయాష్కీ గౌడ్ అన్నారు. ఈటెల రాజేందర్ ఆస్తుల రక్షణ కోసమే బీజేపీలో చేరుతున్నారని ఆయన ఆరోపించారు.