వినాయక నిమజ్జోత్సవాన్ని మతసామరస్యంతో జరుపుకోండి
1 min read– జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి
పల్లెవెలుగు వెబ్ నంద్యాల: ఈ నెల 22వ తేదీ నిర్వహించే వినాయక నిమజ్జోత్సవాన్ని మతసామరస్యంతో ఒకరినొకరు సహకరించుకుంటూ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంత వాతావరణంలో ముగించుకోవాలని జాయింట్ కలెక్టర్ టి. రాహుల్ కుమార్ రెడ్డి ఉత్సవ కమిటీ సభ్యులను, అధికారులను సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై గణేష్ కేంద్ర ఉత్సవ కమిటీ సభ్యులతో ద్వితీయ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించారు. డిఆర్ఓ పుల్లయ్య, గణేష్ మహోత్సవ కేంద్ర సమితి కమిటీ అధ్యక్షులు గంగిశెట్టి విజయకుమార్, రామకృష్ణ విద్యా సంస్థల అధినేత జి. రామకృష్ణారెడ్డి, కార్యాధ్యక్షులు వైద్యం నాగేంద్ర, ప్రధాన కార్యదర్శి నెరవాటి అమర్నాథ్, సివి చలం బాబు, నిమ్మకాయల సుధాకర్, కోశాధికారులు ధమాం శంకర్, రమణ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజిర్ జిలాని సమూన్ మాట్లాడుతూ ఈ నెల 22న స్థానిక చిన్నచెరువు కట్ట వద్ద నిర్వహించే వినాయక నిమజ్జోత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మతసామరస్యంతో నిర్వహించుకోవాలని సూచించారు. వాట్సాప్ లలో ప్రసారమయ్యే రూమర్లను ప్రజలు నమ్మద్దని విస్తృత ప్రచారం కల్పించాలని ఉత్సవ కమిటీ సభ్యులను కోరారు. ఉత్సవ కమిటీ సభ్యులు సూచించిన రూట్ మ్యాప్ ప్రకారం అధికారుల చేపట్టాల్సిన పనులు నేటి సాయంత్రంలోగా పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్ సూచించారు. ప్రార్థన సమయాల్లో ఎలాంటి డ్రమ్స్, అధిక శబ్దాలతో వాయిద్యాలు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లాలో దాదాపు 260 విగ్రహాలు నిమజ్జనం కానున్నాయని అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకున్నామని డిఎస్పి జాయింట్ కలెక్టర్ కు నివేదించారు. దాదాపు 500 మంది పోలీస్ బందోబస్తుతో అన్ని పాయింట్లలో భద్రతా చర్యలు చేపట్టామన్నారు. రోడ్ ప్యాచ్ వర్కులు, భారీ కేడింగ్, అవసరమైన చోట వైద్య శిబిరాలు, చెరువులో పుట్టీలు, స్విమ్మర్లు అవసరమైన వరకు ఏర్పాటు చేసుకొని నిమజ్జనం పూర్తయ్యే వరకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జేసీ ఆదేశించారు. కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి సంబంధిత అధికారుల బృందం ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆర్డిఓ శ్రీనివాసులను ఆదేశించారు. ఊరేగింపు ప్రదేశాల్లోని ముఖ్య కూడలి ప్రాంతాల్లో త్రాగునీటి వసతి ఏర్పాటు చేయాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.