రహదారులపై ప్రమాదాల నివారణకు పటిష్ఠమైన చర్యలు చేపట్టండి
1 min read– జిల్లా రెవెన్యూ అధికారి మధుసూధన్ రావు
పల్లెవెలుగు వెబ్ కర్నూలు : రహదారులపై ప్రమాదాల నివారణకు అవసరమైన పటిష్ఠ చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూధన్ రావు అధికారులను ఆదేశించారు.శుక్రవారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారి మధుసూధన్ రావు అధ్యక్షతన నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి మాట్లాడుతూ ఎన్హెచ్ 44 సంతోష్ నగర్ నుండి మానస ధాభా వరకు తాత్కాలిక బ్యారికెడ్స్ ఏర్పాటు గురించి డిఆర్ఓ అడుగగా 15 రోజులలోపు తాత్కాలిక బ్యారికెడ్స్ ఏర్పాటు చేస్తామని ఎన్హెచ్ 44 అధికారులు డిఆర్ఓకు తెలిపారు. ఎన్హెచ్ 40లోని కెజిఎఫ్ ఫుడ్ రెస్టారెంట్ నుండి నంద్యాల హైవే ఫ్లై ఓవర్ బ్రిడ్జి ప్రారంభం వరకు తాత్కాలిక బ్యారికెడ్స్ ఏర్పాటు చేయాలని ఎన్హెచ్ 40 అధికారులను అడుగగా మరుసటి సమావేశం నాటికి శాశ్వత బ్యారికెడ్స్ చేస్తామని ఎన్హెచ్ 40 అధికారులు తెలిపారు. అదే విధంగా రహదారులపై ఉన్న అనధికార ఒపెనింగ్స్ పై ట్రాఫిక్, ఎన్హెచ్ అధికారులు సంయుక్తంగా సర్వే చేసి అనధికార ఒపెనింగ్స్ పై దృష్టి సారించాలని డిఆర్ఓ ఆదేశించారు. ఎన్హెచ్ 40 నందు హైమాస్ లైట్స్ ఏర్పాటు చేయాలని కోరగా, బి. తాండ్రపాడు ప్రాంతంలో రెండు హైమాస్ లైట్లు ఏర్పాటు చేయడానికి అనుమతులు వచ్చాయని త్వరితగతిన ఏర్పాటు చేస్తామని డిఆర్ఓకు వివరించారు. బళ్లారి చౌరస్తా, రాజ్ విహార్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఉండేందుకు గాను మున్సిపల్ అధికారులు, పోలీసు శాఖ సమీక్ష నిర్వహించి పనులు త్వరితగతిన పూర్తి చేస్తున్నామని సంబంధిత శాఖ అధికారులు డిఆర్ఓకు తెలిపారు. నగరంలో పలు ప్రాంతాలలో ప్రయాణికుల సౌకర్యార్థం 9 బస్ స్టేషన్లు ప్రతిపాదించడం జరిగిందని, అయితే వాటికి సంబంధించి సివిల్ వర్క్స్ జరుగుతున్నందున అవి పూర్తి కాగానే బస్ స్టేషన్ ల నిర్మాణం పనులు మొదలు పెడతామని మున్సిపల్ సిబ్బంది డిఆర్ఓకు వివరించారు. రాజ్ విహార్, బళ్లారి చౌరస్తా విస్తరణ పనులకు ప్రణాళిక సిద్ధం చేయడంతో పాటు రాజ్ విహార్ జంక్షన్ అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని, అదే విధంగా కొండారెడ్డి బురుజు, ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి రోడ్డు నుంచి మెడికల్ కాలేజీ, బిర్లా గేట్ జంక్షన్, గాయత్రి ఎస్టేట్ నుంచి బిర్లా గేట్ వరకు ఆక్రమణలు తొలగించేందుకు కూడా మున్సిపల్, పోలీస్, ఆర్ అండ్ బీ అధికారులు సంయుక్తంగా చర్యలు తీసుకోవాలని అధికారులు డిఆర్ఓకు తెలిపారు. నగరంలో సిసి కెమెరాలపై మున్సిపల్ అధికారులు వివరణ ఇస్తూ నగరంలో 32 చోట్ల సోలార్ తో పని చేసే సిసి కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగిందని, ఇంకా మిగిలిన వాటిని కూడా సెప్టెంబరు చివరి నాటికి ఏర్పాటు చేస్తామని తెలిపారు. నగరంలో పలు ప్రాంతాలలో ఉన్న బ్లాక్ స్పాట్స్, ప్రమాదాలు జరిగే స్థలాలను గుర్తించి వాటి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. రహదారి భద్రతా సమావేశాలకు క్రింది స్థాయి సిబ్బంది హాజరవుతున్నారని, అలా కాకుండా ఉన్నత స్థాయి అధికారులు మాత్రమే సమావేశాలకు హాజరుకావాలని జిల్లా రెవెన్యూ అధికారి సంబంధిత అధికారులను ఆదేశించారు. రవాణా శాఖ డిటిసి మాట్లాడుతూ కేంద్ర రోడ్ల మరియు రవాణా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు హిట్ మరియు రన్ మోటారు ప్రమాదాల పథకం 2022 బాధితులకు హిట్ అండ్ రన్ మోటర్ యాక్సిడెంట్ ఫలితంగా ఎవరైనా మరణించిన సందర్భంలో రూ.2లక్షలు, వ్యక్తికి తీవ్రమైన గాయం అయితే రూ.50వేలు అందజేయడం జరుగుతుంది, అందుకు జిల్లా స్థాయిలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన 6 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుందని వివరించారు. అనంతరం 2023 జూన్ నెలలో జరిగిన రోడ్డు ప్రమాదాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సమావేశంలో రవాణా శాఖ డిప్యూటీ కమీషనర్ శ్రీధర్, ఆర్టిఓ రమేష్, ఆర్టీసి అధికారులు, మున్సిపల్ సిబ్బంది, నేషనల్ హైవే కర్నూలు, అనంతపురం జిల్లాలు అధికారులు తదితరులు పాల్గొన్నారు.