ఏపీ రైతుకు న్యాయం చేయండి..!
1 min read– బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ రంజిత్ కుమార్ కర్ణి
పల్లెవెలుగు వెబ్, వెల్దుర్తి: రైతు రాజ్యం అని చెప్పుకునే సీఎం జగన్ ప్రభుత్వం… రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఎందుకు చెల్లించడంలేదని బీజేపీ రాష్ట్ర ఓబీసీ మోర్చా ఐటీ సెల్ కన్వీనర్ రంజిత్ కుమార్ కర్ణి ఘాటుగా ప్రశ్నించారు. రాత్రింబవళ్లు కష్టపడి సాగు చేసిన పంటకు గిట్టు బాటు ధర చెల్లించకుండా…ధాన్యం పూర్తిగా కొనుగోలు చేయకుండా..అన్నదాతల కంట కన్నీరు చూస్తోందని రాష్ట్ర ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ సోము వీర్రాజు పిలుపు మేరకు.. మంగళవారం పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండలం నందు వెల్దుర్తి, రామల్లకోట, L. కొట్టాల, శ్రీరంగాపురం గ్రామాల్లో రైతుకు న్యాయం చేయాలని నిరసన దీక్ష చేపట్టారు.
రాష్ట్రంలో రైతులు 60 లక్షల టన్నుల ధాన్యం పంట సాగు చేస్తే… 45 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకోవడం దారుణమన్నారు. ధాన్యం నిల్వ చేసుకోలేక.. దళారుల పాలు అవుతోందని, దీంతో రైతులకు పూర్తిగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వం నాబార్డు ద్వారా బిందు సేద్యం పరికరాల కొనుగోలుకు ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి మళ్లించడం .. రైతులను మోసం చేయడమేనన్నారు. రైతులకు న్యాయం చేయకపోతే .. బీజేపీ ఆధ్వర్యంలో అన్నదాతలతో కలిసి ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా రంజిత్ కుమార్ కర్ణి హెచ్చరించారు. అనంతరం తహసీల్దార్ , ఆర్ఐకి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో వెల్దుర్తి మండల అధ్యక్షులు బోయిని కోటి యాదవ్, మండల ప్రధాన కార్యదర్శులు వెంకటేశ్వర రెడ్డి మరియు రామా నాయుడు, ఓబీసీ జిల్లా కార్యదర్శి చిన్న బాబు, మహిళ మోర్చా జిల్లా నాయకురాలు మహేశ్వరి, అరబోలు చంద్ర శేఖర్ తదితర కార్యకర్తలు పాల్గొన్నారు.