రామాపురం పుణ్యక్షేత్రంలో ఉత్తర ద్వార దర్శనం
1 min readపల్లెవెలుగు వెబ్ కమలాపురం : వైయస్సార్ కడప జిల్లా కమలాపురం మండలం శ్రీ రామాపురం మహా పుణ్యక్షేత్రంలో శ్రీమహాలక్ష్మీ మోక్ష నారాయణ స్వామి శ్రీ వల్లి దేవసేన సమేత షణ్ముఖ సుబ్రమణ్యేశ్వర స్వామి దేవతామూర్తులు కొలువైన ఆలయంలో సోమవారం నాడు భాద్రపద శుక్ల ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయనున్నారు.ప్రతి మాసంలో శుక్లపక్ష ఏకాదశి సందర్భంగా ఈ ఆలయంలో ఉత్తర ద్వార ప్రవేశం చేసి దేవదామూర్తులను దర్శించుకునే మహత్తర భాగ్యం కలుగుతోంది. పరివర్తన ఏకాదశిగా పిలువబడే భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశి నాడు ఉత్తర ద్వారం నుంచి ఆలయంలోకి ప్రవేశించి హరిహరాదులను దర్శించుకుంటే సకల శుభాలు చేకూరుతాయని ఆలయ చరిత్ర చెబుతోంది. పాల సముద్రంలో నాలుగు నెలల యోగ నిద్ర కు వెళ్లిన మహావిష్ణువు ఎడమ వైపుకు ఈ ఏకాదశి నాడు తిరుగుతాడు కాబట్టి ఏకాదశిని పరివర్తన ఏకాదశిగా పురాణాలు పేర్కొంటున్నాయి. ఈ ఏకాదశి సందర్భంగా ఆలయానికి విచ్చేసి భక్తాదులకు అన్ని రకాల సదుపాయాలు ఆలయ ప్రధాన సేవకులు కాశీభట్ల సత్య సాయినాథ్ శర్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు. సాయంత్రం ఐదున్నర గంటలకు ఆలయ మాడవీధులలో గరుడ వాహనంపై మహాలక్ష్మి మోక్ష నారాయణ స్వామిని ఊరేగించనున్నారు.