PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

వైసీపీలో పదవుల రగడ….

1 min read

పదవులు మూడునాళ్ల ముచ్చటేనా..?

పదవుల పంపకాలలో కూడా ఆధిపత్య పోరు.

పార్టీ కోసం కష్టపడితే పదవులు దక్కడం లేదా..?

వర్గపోరుతో నలిగిపోతున్న గ్రామ నాయకులు.. కార్యకర్తలు.

టీడీపీ వైపు చూస్తున్నా వైసీపీ అసంతృప్తి వర్గం.

పల్లెవెలుగు వెబ్ నందికొట్కూరు:  నందికొట్కూరు వైసీపీలో నానాటికీ వర్గ పోరు పెరుగుతోంది. 2019 ఎన్నిక‌ల‌కు ముందు కేవ‌లం ఒకే ఒక నాయ‌కుడిగా ఉన్న వైసీపీ ఇప్పుడు ద్విముఖంగా మారిపోయింది. ఇద్దరు నాయ‌కులు నియోజ‌క‌వ‌ర్గంపై ఆధిప‌త్య పోరుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో పార్టీ అధికారంలో ఉండి కూడా ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌నే వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి. మ‌రోప‌క్క‌, పార్టీలోనూ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు ఎవ‌రికి వారే.. అన్న విధంగా రెండు జ‌ట్లుగా విడిపోయి  రాజ‌కీయం చేసుకుంటున్నారు.నందికొట్కూరు లో నెల‌కొన్ని ఈ ప‌రిస్థితి వైసీపీకి త‌ల‌నొప్పిగా మార‌డంతోపాటు  ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు ఆట‌ప‌ట్టుగా మారింది.గ‌త ఏడాది ఎన్నిక‌ల‌కు ముందు తొగురు ఆర్థర్  ఒక్క‌రే  నాయ‌కుడుగా ఉన్నారు.ఈయన గెలుపు కోసం వైసీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ రెడ్డి వైసీపీలో అన్నీ తానై వ్య‌వ‌హ‌రించారు.అంత్యంత భారీ మెజారిటీతో అర్థర్ ను గెలిపించారు.  కార్య‌క‌ర్త‌ల‌ను స‌మీక‌రించారు. త‌న మాట నెగ్గేలా చ‌క్రం తిప్పారు. అయితే, త‌ర్వాత మారిన‌రాజ‌కీయ ప‌రిణామాలు, ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఇక్క‌డ నుంచి విజ‌యం సాధించిన ఎమ్మెల్యే ఆర్థర్ అధికారులకు సిద్దార్థ అనుచరులు అడ్డుపడుతూ వచ్చారు.ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమానికి కూడా ఎమ్మెల్యే ను ఆహ్వానించపోవడంతో వైసీపీలో వర్గపోరు మొదలైంది. ఎమ్మెల్యే నేనే కాబ‌ట్టి  నేనే అధికారం చ‌లాయించాల‌నే ధోర‌ణిలో ఆర్థర్ ఉన్నారు. కానీ, పార్టీలో నేనే ముందు నువ్వు  అణిగిమ‌ణిగి ఉండాల‌నే ధోర‌ణితో సిద్దార్థ  వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఆర్థర్ ఎమ్మెల్యే గా  గెలిచిన  ఇప్ప‌ట‌కీ నియోజ‌క‌వ‌ర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జ్‌గా సిద్దార్థ రెడ్డి  ఉన్నారు. వీరి మ‌ధ్య నియోజ‌క‌వ‌ర్గం విష‌యంలోనూ ర‌గ‌డ చోటు చేసుకుంది. 

అయోమయంలో కార్యకర్తలు….

నేతల మధ్య ఆధిపత్సపోరులో కార్యకర్తలు సమిధలవుతున్నారు. తొమ్మిదేళ్ల పాటు జెండా మోసి తీరా అధికారం వచ్చిన తరువాత పనులు చేసుకొని బాగుపడతామని ఆశించిన కార్యకర్తలకు తీవ్ర నిరాశ ఎదురవుతోంది. నియో జకవర్గాల్లో ఆధిపత్యం కోసం ఎమ్మెల్యేలు, ఇన్చార్జిలు ఢీ అంటే ఢీ అంటుండంతో ఎవరి వెంట వెళ్ళాలో తెలియక దిగువస్థాయి నేతలు, కార్యకర్తలు తలలు పట్టుకుంటున్నారు. గత ఎన్నికల్లో   వైసీపీకి తిరుగులేని మెజార్టీ వచ్చింది అందరు ఉమ్మడిగా కష్టపడి పని చేయడం వల్లే భారీ మెజార్టీతో అభ్యర్థులు గెలుపొందారు. కాని ఇప్పుడు ఉమ్మడిగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్న విధంగా ముందుకెళుతుండడంతో పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారుతోందని, జెండా మోసిన కార్యకర్తలు కూడా ఎవరి వెంట వెళ్ళాల్లో తెలియక అయోమయ పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారని పలువురు వాపోతున్నారు. ఒకరి వెంట వెళితే మరొకరు అడ్డుకట్ట వేస్తున్నారని అంతటితో ఆగక ఏకంగా కేసులు కూడా సొంత పార్టీ నేతలపైన బనాయిస్తున్నారని వాపోతున్నారు. ఈ మద్య ప్రకటించిన జిల్లా కమిటీలో ఎమ్మెల్యే వర్గానికి పదవులు దక్కాయి..అయితే ఆ పదవులు ముడునాళ్ళ ముచ్చటగానే మిగిలాయి. ఎమ్మెల్యే వర్గం అనుచరులను పదవుల నుంచి తప్పించి జిల్లా నాయకత్వం సిద్దార్థ వర్గానికి పదవులు కట్టబెట్టారు. దీనితో ఎమ్మెల్యే వర్గం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ఈ మధ్య జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం జగన్ వద్ద  ఎమ్మెల్యే వర్గం కార్యకర్తలు తమ బాధను వెల్లడిస్తే సిద్దార్థను కలుపుకొని వెళ్లాలని హిత బోధ చేసినట్లు సమాచారం.

వైసీపీ అసంతృప్తులు టీడీపీ వైపు మొగ్గు..

వైసీపీ పార్టీలో  సరైన ప్రాధాన్యం దక్కకపోవడం, పదవుల్లోనూ అన్యాయం జరగడం, కొంతమంది సీనియర్ నాయకులు నామిటెడ్ పదవులపై ఆశలు పెట్టుకున్నా, సామాజికవర్గాల లెక్కల్లో వారికి  పదవులు దక్కకపోవడం ఇలా ఎన్నో కారణాలతో  చాలామంది వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ఎన్నికల నాటికి ఈ అసంతృప్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.దీనిని తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది.

జనసేన,  టిడిపిలు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని  వైసిపి లోని అసంతృప్తి నాయకులు ఇప్పుడు టిడిపి వైపు చూస్తున్నారు.వైసీపీలో సరైన ప్రాధాన్యం దక్కక అసంతృప్తి ఉన్న  నాయకుల కార్యకర్తల వివరాలను ప్రస్తుతం టిడిపి సేకరిస్తోంది.టీడీపీపార్టీకి చెందిన కొంతమంది కీలక నాయకులను ఒక బృందంగా ఏర్పరిచి వైసిపి అసంతృప్త నాయకులను తమ దారికి తెచ్చే ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు సమాచారం.

ఇప్పటికిప్పుడు కాకపోయినా, ఎన్నికల సమయం నాటికైనా పెద్దఎత్తున వైసీపీ కీలక నాయకులు టిడిపిలో చేరుతారని ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది.వైసీపీకి చెందిన ఐదు మంది కౌన్సిలర్లు ఇప్పటికే టిడిపి తో టచ్ లోకి వెళ్లారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి .వీరే కాకుండా మరెంతో మంది అసంతృప్త నేతలు టీడీపీ వైపు వచ్చే అవకాశం ఉన్నIట్టుగా తేలడంతో టీడీపీ పార్టీ వలసలపై భారీగా ఆశలు పెట్టుకున్నట్లు సమాచారం. ఇప్పటికైనా వైసీపీ అధిష్టానం నందికొట్కూరు నియోజకవర్గం పై  దృష్టి సారించి  వర్గవిభేదాల పరిష్కారానికి కృషి చేయాలని కోరుతున్నారు. లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపోటములపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మరి వైసీపీ పెద్దలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే..!!

About Author