ఖైదీలు సత్ప్రవర్తన తో నడుచుకోవాలి….
1 min read– జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య.
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: ఖైదీలు సత్ప్రవర్తన తో నడుచుకోవాలని జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య సూచించారు.సోమవారం పంచలింగాల గ్రామ సమీపంలోని జిల్లా కారాగారం నందు జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలను వేసి జాయింట్ కలెక్టర్ నారపు రెడ్డి మౌర్య,జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీ సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు, అడిషనల్ ఎస్పీ టి సర్కార్ ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఖైదీల సంక్షేమ దినోత్సవంలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య మాట్లాడుతూ భారత జాతిపిత మహాత్మా గాంధీ జయంతి రోజుననే ఖైదీల సంక్షేమ దినోత్సవం కూడ జరుపుకుంటున్నామన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ అహింస, శాంతి బాటలో నడిచి దేశానికి స్వాతంత్రం తీసుకొని వచ్చారని అన్నారు. ఖైదీలందరూ సత్ ప్రవర్తన తో నడుచుకోవాలన్నారు జైలు ప్రాంతం ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉందని, ఇటువంటి ప్రదేశాల్లో అధికారులుగా విధులు నిర్వర్తించడానికి రావాలి గాని ఖైదీగా జైలుకు రాకూడదన్నారు.ఖైదీలు ఇక్కడి నుండి విడుదలైన తర్వాత నేర ప్రవర్తనను మనసులో నుండి తీసివేసి బాధ్యత గల పౌరుడిగా ఉండాలని, మరల జైలుకు రాకుండ చూసుకోవాలన్నారు.జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సి.హెచ్.వెంకట నాగ శ్రీనివాస రావు మాట్లాడుతూ సమాజంలో తనకోసం తాను జీవించకుండా ప్రజల కోసం జీవించే వారికి మరణమే లేదన్నారు.. వారు ప్రజల్లో శాశ్వతంగా నిలిచిపోతారని అందుకు నిదర్శనం జాతిపిత మహాత్మా గాంధీని గారన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ దగ్గర ఆయుధం కంటే ఎక్కువ విలువైన అహింస అనే ఆయుధం ఉందని వారు ఎప్పుడూ సత్యాన్నే పలుకుతూ ముందుకు సాగే వ్యక్తి అన్నారు. ప్రతి మనిషి నేరం చేయాలనే ఆలోచన మనసు నుండి తీసివేసి స్వేచ్ఛగా బ్రతకాలని ఖైదీలకు సూచించారు. తప్పు చేసిన వారిని కుటుంబము, సమాజం కూడా క్షమించదన్నారు. ఒక్కసారి జైలుకు వచ్చిన వ్యక్తి మళ్లీ జైలుకు రాకుండా చూసుకోవాలన్నారు. ఈ మధ్యకాలంలో దాదాపుగా 40 మంది ఖైదీలు మత్తు పదార్థాలను విక్రయించడం, సేవించడం వల్ల శిక్ష అనుభవిస్తున్నారని, మత్తు పదార్థాలను ఎవరు విక్రయించరాదు, సేవించరాదన్నారు. ప్రతి మనిషి క్రమశిక్షణతో బ్రతికే అలవాటును అలవర్చుకోవాలన్నారు. యువత జైలుకు వస్తే వారి కుటుంబం ఇబ్బందులు పడుతుందని కావున యువత మంచి మార్గంలో నడవాలని ఖైదీలకు సూచించారు. జైల్ సూపరింటెండెంట్ గణెనాయక్ మాట్లాడుతూ మహాత్మా గాంధీ జయంతి రోజును ఖైదీల సంక్షేమ దినోత్సవాన్ని కూడ జరుపుకుంటున్నామన్నారు. ఈ కారాగారంను 23 ఎకరాలు విస్తీర్ణంలో నిర్మించారని, ఈ జైల్లో 240 మంది ఖైదీలు ఉండే విధంగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. జైల్లో ఉండే ఖైదీలకు వారంలో రెండు మూడు రోజులు చికెన్ కూడా అందిస్తున్నాం అన్నారు. ఆరోగ్య విషయంలో జైలుకు ఒక డాక్టర్ కూడా ఉన్నారని, అత్యవసరమైతే ఆరోగ్యశ్రీ ద్వారా ఖైదీలకు వైద్యం కూడా అందిస్తారన్నారు. ఖైదీలకు సోలార్ వాటర్ ద్వారా వేడి నీళ్లు అందిస్తున్నామని, బట్టలు ఉతుక్కోవడానికి వాషింగ్ మిషన్, త్రాగడానికి మినరల్ వాటర్, వినోదం కోసం టీవీ ని కూడా ఏర్పాటు చేశామన్నారు. నిరక్షరాస్య ఖైదీలకు విద్యను నేర్పుతున్నామని, జైలు కు వచ్చేటప్పుడు వేలు గుర్తు వేసేవారు తిరిగి వెళ్ళేటప్పటికి సంతకం చేసేలా తయారైన వారు ఉన్నారని అన్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా జైలు పరిసర ప్రాంతాలను ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చి దిద్దామన్నారు. ప్రస్తుతం జైలు లో 60 మంది ఖైదీలు ఉన్నారని, ఖైదీల సంఖ్య తగ్గుతుందంటే క్రైమ్ కూడా తగ్గుతున్నట్లే అన్నారు. ఖైదీలను ముఖ్యంగా కోరేది ఏమంటే నేర ప్రవృత్తిని మానుకొని మంచి మార్గంలో నడుచుకోవాలని ఖైదీలకు సూపరింటెండెంట్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జైలర్ ఎరికినాయుడు, ఖైదీలు తదితరులు పాల్గొన్నారు.