ఏపీ అభివృద్ధి కోసం చంద్రబాబు కావాలి.. టి.జి భరత్
1 min read– బాబు అరెస్టుపై ప్రజలు ఆవేదన చెందుతున్నారు
– నిరాహార దీక్షలో పాల్గొని మాట్లాడిన టి.జి భరత్
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: మన రాష్ట్రం అభివ్రుద్ది కావాలంటే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును సీఎం చేసుకోవాలని ప్రజలకు చెప్పారు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జి టి.జి భరత్. బుధవారం నగరంలోని ధర్నా చౌక్ వద్ద జరుగుతున్న రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు గురించి ప్రజలు అర్థం చేసుకుంటున్నారన్నారు. తాము చేస్తున్న ఆందోళనలు, నిరసన దీక్షలతో ప్రజల్లో కూడా ఈ విషయంపై చర్చ జరుగుతుందన్నారు. తన వార్డు పర్యటనల్లో చంద్రబాబు అరెస్టుపై ప్రజలు ఆవేదన చెందుతున్నారన్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి 2024 వరకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంటుందన్నారు. చంద్రబాబు అమరావతిని డెవలప్ చేసుకుందామని హైదరాబాద్ ను వదులుకొని వచ్చారని.. అయితే ఏపీ ప్రజలు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఓడించి తప్పుచేశారన్నారు. ఇక హైదరాబాద్ లో ఉంటున్న ప్రజలు, ఉద్యోగులు చంద్రబాబుకి మద్దతుగా నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో మంత్రి కె.టి.ఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమన్నారు. ఎంతో అభివ్రుద్ది చెందిన హైదరాబాద్ వాళ్లకు క్యాపిటల్ సిటీగా ఉంది.. కానీ ఏపీలో మనకు చెప్పుకోవడానికి కూడా రాజధాని లేదని.. అందుకే ఆయన అలా మాట్లాడింటారన్నారు. ఇప్పటికైనా ప్రజలంతా ఆలోచించుకోవాలని.. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని గెలిపిస్తే అభివ్రుద్దితో పాటు, సంక్షేమం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తెదేపా నగర అధ్యక్షుడు నాగరాజు యాదవ్, తెలుగు యువత అధ్యక్షుడు అబ్బాస్, టి.ఎన్.ఎస్.ఎఫ్ అధ్యక్షుడు రాజ్ కుమార్, మహిళా కమిటీ అధ్యక్షురాలు రాజ్యలక్ష్మి, కార్పోరేటర్ పరమేశ్, మాజీ కార్పోరేటర్లు, నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.