అల్లూరి సీతారామరాజు స్టేడియంను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతాం..
1 min read– క్రీడారంగం అభివృద్ధికి మరిన్ని ఏర్పాట్లు..ఎంపీ కోటగిరి శ్రీధర్
– జిల్లా కలెక్టర్ వై ప్రసన్న వెంకటేష్ తో చర్చ
పల్లెవెలుగు వెబ్ ఏలూరు : ఏలూరులోని అల్లూరి సీతారామరాజు స్టేడియం ను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నట్లు ఏలూరు పార్లమెంట్ సభ్యులు కోటగిరి శ్రీధర్ చెప్పారు. అల్లూరి సీతారామరాజు స్టేడియం అభివృద్ధిపై శుక్రవారం కలెక్టరేట్ లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తో విస్తృతంగా చర్చించిన అనంతరం ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ క్రీడారంగం అభివృద్ధికి ఏలూరు లో అల్లూరి సీతారామరాజు స్టేడియం నిర్మించి దాదాపు 30 సంవత్సరాలు అవుతున్నదన్నారు. రాష్ట్రంలో స్పోర్ట్స్ అథారిటీ అఫ్ ఇండియా వారు నిర్మించిన ఏకైక అథ్లెటిక్ కేంద్రం అల్లూరి సీతారామరాజు స్టేడియం అని, ఇక్కడ శిక్షణ తీసుకున్న క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మెడల్స్ సాధించారన్నారు. స్టేడియంలో ప్రస్తుతం సింథటిక్ ట్రాక్ లేదని, రాష్ట్రంలో నాగార్జున యూనివర్సిటీ లోని స్టేడియం లో మాత్రమే సింథటిక్ ట్రాక్ ఉందన్నారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంను 9. 50 కోట్ల రూపాయలతో అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్ది, 8 లైన్ల ట్రాక్ ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో ప్రధానమైన క్రీడాపోటీలు ఏలూరులో నిర్వహిస్తామన్నారు. ఖేల్ ఇండియా కార్యక్రమం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 50 శాతం వరకు నిధులు సమకూరుస్తుందని, మిగిలిన 50 శాతం నిధులను స్థానికంగా సేకరించవలసి ఉందన్నారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులు అందిస్తామని, వీటితో ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నిధులు కూడా అందించేందుకు చర్యలు తీసుకుంటారన్నారు. అల్లూరి సీతారామరాజు స్టేడియం అభివృద్ధికి జిల్లా కలెక్టర్ వె. ప్రసన్న వెంకటేష్ తమ పూర్తి సహకారం అందిస్తానని చెప్పారని ఎంపీ చెప్పారు. . జిల్లా కలెక్టర్, ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ , క్రీడాభివృద్ధి సంస్థల సహకారంతో ఏలూరులో అంతర్జాతీయ స్థాయి స్టేడియం రూపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంపీ కోటగిరి శ్రీధర్ చెప్పారు. ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కార్యదర్శి చంద్రశేఖర్, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ చీఫ్ కోచ్ శ్రీనివాస్, ప్రభృతులు పాల్గొన్నారు.