మహిళకు అత్యంత క్లిష్టమైన విపుల్స్ ప్రొసీజర్
1 min read* క్లోమం, పేగు, కాలేయం, ఉదరం కలిసేచోట క్యాన్సర్ గడ్డ
* 7 గంటల పాటు సంక్లిష్టమైన శస్త్రచికిత్స
* ఆరోగ్యశ్రీలో పూర్తి ఉచితంగా సేవలు
* కర్నూలు కిమ్స్ వైద్యుడు జానకిరామ్ ఘనత
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: కామెర్లు అనుకుంటే అదికాస్తా క్యాన్సర్ కావడం, అది కూడా చాలా సంక్లిష్టమైన ప్రదేశంలో ఉండటంతో తీవ్రంగా బాధపడుతున్న ఓ మహిళకు కర్నూలు కిమ్స్ ఆస్పత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడారు. ఆమెకు వచ్చిన సమస్య, అందించిన చికిత్స తదితర వివరాలను కిమ్స్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ జానకిరామ్ తెలిపారు. “నంద్యాల జిల్లా రుద్రవరం మండలానికి చెందిన లక్ష్మీదేవి అనే 43 ఏళ్ల మహిళకు కామెర్లు తీవ్రస్థాయిలో వచ్చాయి. రక్తంలో బైలురూబిన్ సాధారణంగా 1 ఎంజీ/డీఎల్ ఉంటుంది. ఆమెకు ఏకంగా 18 ఎంజీ/డీఎల్ స్థాయికి చేరుకుంది. తొలుత నంద్యాలలోని ఆస్పత్రులలో చూపించి, అక్కడ నయం కాకపోవడంతో కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. ముందుగా కామెర్లు తగ్గించేందుకు ఎండోస్కొపీ చేసి స్టెంట్ వేసి, తగిన మందులు ఇచ్చాము. నెల రోజుల్లో కామెర్లు మొత్తం తగ్గి సాధారణ స్థితికి చేరుకున్నారు. అప్పటికే పరీక్షలు చేయడంతో ఆమెకు లోపల ఒక కణితి ఉన్న విషయాన్ని గుర్తించాము. కాలేయం, క్లోమం, పేగులు.. ఈ మూడింటి నుంచి వచ్చే పైపులు కలిసే ఒక జంక్షన్ లాంటి ప్రదేశంలో ఆమెకు కణితి ఉంది. దాంతో ఆమెకు విపుల్స్ ప్రొసీజర్ ద్వారా మాత్రమే నయం చేయగలమని నిర్ణయించి, ఆ శస్త్రచికిత్స చేయాల్సి వచ్చింది. ఇందులో భాగంగా క్లోమాన్ని దాదాపు 40 శాతం వరకు కత్తిరించి తీసేశాం. దాంతోపాటు కాలేయం నుంచి వచ్చే పైపు, ఉదరం నుంచి వచ్చే పేగు, పైకి వచ్చే పేగు.. వీటన్నింటినీ కత్తిరించాల్సి వచ్చింది. చిన్న పేగులో 15 సెంటీమీటర్లు తీసేశాం. కింద ఉన్న చిన్నపేగును పైకి తీసుకొచ్చి, క్లోమానికి కలిపి కుట్టాం. కాలేయం నుంచి వచ్చేపైపు, ఉదరం.. ఇలా మూడుచోట్ల కుట్లు వేయాల్సి వచ్చింది. దీనివల్ల ఇప్పుడు శస్త్రచికిత్స తర్వాత క్లోమరసం, కాలేయం నుంచి వచ్చే స్రావాలు నేరుగా పేగుల్లోకి వెళ్తాయి. మనం తిన్న ఆహారం దీనివల్ల సర్వసాధారణంగానే అరుగుతుంది. ఈ మూడింటిలో క్లోమానికి కుట్లు వేయడం అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియ. అది చాలా సున్నితంగా ఉంటుంది. దాన్ని కుట్టేటప్పుడు చాలా నేర్పరితనంతో చేయాలి. దానికి రంధ్రం పడకూడదు. పడితే, క్లోమరసం బయటకు వస్తుంది. క్లోమరసం అనేది మనం తిన్న ఆహారాన్ని జీర్ణం చేయడానికి ఉపయోగపడుతుంది. అది నేరుగా పేగుల్లోకి వెళ్తే ఎలాంటి ప్రమాదం ఉండదు. అదే లీకేజి వల్ల బయటకు వస్తే, చుట్టుపక్కల ఉన్న రక్తనాళాలు, పేగులు, కాలేయం లాంటి భాగాలను తినేస్తుంది. అందుకే క్లోమానికి సంబంధించిన శస్త్రచికిత్సలు అత్యంత జాగ్రత్తగా చేయాల్సి ఉంటుంది. మొత్తం శస్త్రచికిత్సకు 7 గంటలు పట్టింది. ఐదురోజులు ఐసీయూలో ఉంచి పరిశీలించిన తర్వాత మరో ఐదు రోజులు వార్డులో ఉంచి.. ఆమెకు జీవక్రియలన్నీ సాధారణంగానే జరుగుతున్నట్లు నిర్ధారించిన తర్వాత డిశ్చార్జి చేశాం. ఇంత సంక్లిష్టమైన శస్త్రచికిత్సకు హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో అయితే దాదాపు రూ.5 లక్షల వరకు అవుతుంది. కానీ ఇక్కడ ఆరోగ్యశ్రీలో ఉచితంగానే చికిత్స అందించాం. తొలగించిన భాగాలను బయాప్సీకి పంపగా, ఆమెకు కేన్సర్ అన్న విషయం ఖరారైంది. దాంతో ఇప్పుడు ఆమెను కీమోథెరపీ కోసం పంపించాం” అని డాక్టర్ జానకిరామ్ వివరించారు. లక్ష్మీదేవి గత కొంతకాలంగా బాగా ఇబ్బంది పడుతున్నారని, తొలుత కామెర్లు మాత్రమే అనుకుంటే అది చాలా తీవ్రమైన సమస్యగా తేలిందని ఆమె కుటుంబసభ్యులు చెప్పారు. కర్నూలు కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చిన తర్వాతే డాక్టర్ జానకిరామ్ ఆమెకున్న సమస్యేంటో తమకు వివరించి, 7 గంటలపాటు ఆపరేషన్ చేసి ఊరట కల్పించారని తెలిపారు. ఆమెకు పూర్తిగా నయం చేసిన డాక్టర్ జానకిరామ్‌కు, కిమ్స్ ఆస్పత్రి వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.