గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని త్రాగునీటి అవసరాలకు సంరక్షించుకోవాలి
1 min read– జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన
పల్లెవెలుగు వెబ్ కర్నూలు: జిల్లాలో ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు నెలకొన్న కారణంగా గాజులదిన్నె ప్రాజెక్ట్ నీటిని త్రాగునీటి అవసరాల కోసం ఏప్రిల్, మే నెలల వరకు సంరక్షించుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఇరిగేషన్ శాఖ అధికారులకు సూచించారు. శుక్రవారం గోనెగండ్ల మండల కేంద్రం సమీపంలో ఉన్న గాజులదిన్నె ప్రాజెక్ట్ ను జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్యతో కలిసి జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గాజులదిన్నె ప్రాజెక్ట్ సామర్థ్యం పెంపుకు సంబంధించి భూసేకరణ పై ఇరిగేషన్ శాఖ అధికారులను ఆరా తీశారు. 400 ఎకరాలను సేకరించేందుకు దేవనకొండ, గోనెగండ్ల మండలాలలో సర్వే జరుగుతోందని ఇరిగేషన్ శాఖ ఎస్ ఈ రెడ్డి శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కి వివరించారు. భూసేకరణ కు సంబంధించిన వివరాలతో ల్యాండ్ ప్లాన్ షెడ్యూల్స్ ను జాయింట్ కలెక్టర్ కు ఇవ్వాలని ఇరిగేషన్ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్, ఇరిగేషన్ ఎస్ఈ రెడ్డి శేఖర్ రెడ్డి, ఈ ఈ శైలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.