టీఎంఏ-నియో ఆధ్వర్యంలో 250 మంది మెడికోల “మెడ్ వోయేజ్”
1 min read* ఉబ్జెకిస్థాన్‌లో వైద్యవిద్యకు బయల్దేరిన 250 మంది భారతీయ విద్యార్థులు
* తాష్కెంట్ మెడికల్ అకాడమీలో సబ్సిడీ ఫీజులతో ఎంబీబీఎస్
* కార్యక్రమాన్ని ఇండియా తరఫున ప్రారంభించిన సముద్రాల వేణుగోపాలాచారి, పి.విజయబాబు, డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్, డాక్టర్ దివ్యరాజ్, నియో రాజ్, రోహిత్, ఉజ్బెకిస్థాన్ ప్రతినిధులు
* నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ సహకారంతో కార్యక్రమం
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : విదేశాల్లో వైద్యవిద్య అనగానే ఖర్చు బాగా ఎక్కువని అనుకుంటారు. కానీ, ఉజ్బెకిస్థాన్‌లోని తాష్కెంట్ మెడికల్ అకాడమీ (టీఎంఏ) లో కేవలం రూ.20 లక్షల ఫీజుతో వైద్యవిద్య పూర్తిచేసే అవకాశాన్ని భారతీయ విద్యార్థులకు నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ కల్పించింది. సబ్సిడీతో రూ.20 లక్షలకే మొత్తం వైద్యవిద్యను పూర్తిచేయొచ్చు. అది కూడా 12 వాయిదాల్లో, అంటే సెమిస్టర్‌కు సుమారు రూ.1.60 లక్షలు మాత్రమే కట్టి చదువుకోవచ్చు. ఇలా చదివేందుకు బయల్దేరుతున్న 250 మంది విద్యార్థులకు మెడ్ వోయేజ్ కార్యక్రమాన్ని శుక్రవారం అట్టహాసంగా నిర్వహించారు. రాజ్‌భవన్ రోడ్డులోని పార్క్ హోటల్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్, కేంద్ర మాజీమంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి, ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం చైర్మన్, మాజీ ఆర్టీఐ కమిషనర్, ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ పి. విజయబాబు, ప్రముఖ పల్మనాలజిస్టు, డా.విశ్వేశ్వరన్, ఉజ్బెకిస్థాన్ ఆరోగ్య మంత్రిత్వశాఖ భారతీయ అధికార ప్రతినిధి డాక్టర్ దివ్యా రాజ్‌రెడ్డి, ఉజబేకిస్తాన్ రాయబారకార్యాలయం ప్రతినిధి శ్రీ మొహమ్మద్, టీఎంఏ రెక్టర్ డా. శుక్రత్, అసిస్టెంట్ రెక్టర్ డా. సలీవ్, ఇంటర్నేషనల్ హెడ్ డా.మురాద్, నియో రాజ్, శ్రీరోహిత్ పాల్గొని విద్యార్థులకు వీడ్కోలు పలికారు. ప్రతిభావంతులైన కొందరు విద్యార్థులకు స్కాలర్ షిప్ లు, ఐపాడ్లు, వైద్యవిద్య పాఠ్య పుస్తకాలు, ఉజ్బెకిస్థాన్‌కు ఉచితంగా విమాన టికెట్లు అందించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్, కేంద్ర మాజీమంత్రి డాక్టర్ సముద్రాల వేణుగోపాలాచారి మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం వైద్యవిద్యకు అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, అలాగే విద్యార్థులు విదేశాల్లోనూ మంచి విద్యావకాశాలు పొంది.. తిరిగొచ్చిన తర్వాత మాతృభూమికి సేవలందించాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం చైర్మన్, మాజీ ఆర్టీఐ కమిషనర్, ఆంధ్రప్రభ చీఫ్ ఎడిటర్ పి. విజయబాబు మాట్లాడుతూ, ఏదేశమేగినా.. ఎందుకాలిడినా పొగడరా నీ తల్లి భూమి భారతిని అన్నట్లు.. ఎక్కడకి వెళ్లినా మన సంస్కృతీ సంప్రదాయాలను విద్యార్థులు మరిచిపోకూడదని తెలిపారు. ప్రముఖ పల్మనాలజిస్టు, స్లీప్ మెడిసన్ స్పెషలిస్టు డాక్టర్ విశ్వేశ్వరన్ బాలసుబ్రమణియన్ మాట్లాడుతూ, నేటి బాలలే రేపటి పౌరులన్నట్లు.. నేటి మెడికోలే రేపటి సూపర్ స్పెషలిస్టులని, విద్యార్థులంతా శ్రద్ధగా చదువుకుని.. తనకంటే పెద్ద స్పెషలిస్టులు కావాలని, రోగుల సేవలో తరించాలని ఆకాంక్షించారు. నియో ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ డైరెక్టర్ దివ్యా రాజ్ రెడ్డి మాట్లాడుతూ, “నేను ఉజ్బెక్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ భారత ప్రతినిధిగా నియామకం పొందిన తర్వాత ఉజ్బెకిస్థాన్ యూనివర్సిటీలు తమ అధికారిక ప్రతినిధి కార్యాలయాలను ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ ఇనాయతోవ్ సహకారంతో ఇక్కడ తెరిచేలా ఒప్పించినందుకు చాలా గర్వపడుతున్నాను. తాష్కెంట్ మెడికల్ అకాడమీ తమ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో తెరిచింది. నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) పెట్టిన నిబంధనలకు మన విద్యార్థులు కట్టుబడి ఉండాలి. ఉజ్బెకిస్థాన్, భారతదేశాల మధ్య ప్రయాణ సమయం కేవలం రెండున్నర గంటలే. దీనికి ఇండిగో విమాన టికెట్లు రూ.10వేల నుంచి రూ.20 వేలలోపు ఉన్నాయి. పేషెంట్-డాక్టర్ ఎక్స్‌ఛేంజ్ కార్యక్రమాలు పెంచాం. టీఎంఏలో ఎంబీబీఎస్‌తో సమాన కోర్సులను ప్రవేశపెట్టాం. నియో సంస్థ సహకారంతో టీఎంఏ.. ఇక్కడి పలు ఆస్పత్రులతో, కాలేజులతో ఎంఓయూలు చేసుకుందని వివరించారు. ఉజ్బెకిస్థాన్ అధ్యక్షుడు షవ్‌కత్ మిర్జియొయెవ్ భారతదేశంలో ఫార్మారంగంతో కలిసి జాయింట్ వెంచర్ల ఏర్పాటుకు చాలా ఆసక్తిగా ఉన్నారు. భాగస్వామ్యానికి భారతీయ ఫార్మా సంస్థలను ఆహ్వానిస్తున్నారు” అని వివరించారు. అలాగే డిసెంబర్‌లో ఇండో-ఉజ్బెక్ హెల్త్ ఫోరంను హైదరాబాద్ లో నిర్వహించాలని చూస్తున్నట్లు చెప్పారు. న్యూఢిల్లీలో ఉజ్బెకిస్థాన్ రాయబార కార్యాలయంలోని ఫస్ట్ సెక్రటరీ మహమ్మద్, తాష్కెంట్ మెడికల్ అకాడమీ రెక్టార్ ప్రొఫెసర్ బొయ్‌మురడొవ్ షుక్రత్, అసిస్టెంట్ రెక్టార్ డాక్టర్ సలియెవ్ అక్రమ్‌జాన్, టీఎంఏలో అంతర్జాతీయ వ్యవహారాల విభాగం అధిపతి ప్రొఫెసర్ జఫరొవ్ మురోద్ తదితరులు మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఎన్ఎంసీ నిబంధనలకు లోబడి వైద్యవిద్య బోధిస్తామని, అదే సమయంలో వారి భద్రత, సంక్షేమాలకు పెద్దపీట వేస్తామని చెప్పారు. పిల్లల తల్లిదండ్రులు నిర్భయంగా వారిని పంపొచ్చని, వారు నిపుణులైన వైద్యులుగా తిరిగొస్తారని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ప్రత్యక్షంగాను, వర్చువల్‌గాను పాల్గొన్న పలువురు విద్యార్థులు మాట్లాడుతూ, నియో ఇన్‌స్టిట్యూట్ సహకారంతోనే తాము తాష్కెంట్ మెడికల్ అకాడమీలో తక్కువ ఖర్చుతో వైద్యవిద్య చదువుకునే అవకాశం లభించిందని, ఇందుకు నియో సంస్థ, టీఎంఏ ఇండియా ఆఫీసుల అధిపతులకు, మెడ్ వోయేజ్ కార్యక్రమంలో ప్రోత్సహించిన ముఖ్య అతిథులకు ధన్యవాదాలు తెలుపుకొంటున్నామని అన్నారు.