కరిగిపోతున్న గువ్వల గుట్టలు
1 min read– అనుమతులు లేకుండా అక్రమ మట్టి తరలింపు
– పట్టించుకోని రెవెన్యూ, పోలీసు, భూగర్భగనుల శాఖ అధికారులు
పల్లెవెలుగు వెబ్ శ్రీరంగాపూర్: శ్రీరంగాపూర్ మండల పరిధిలోని వెంకటాపూర్ గ్రామ శివారులో సమీపంలోని గువ్వలగుట్టను అక్రమంగా మైనింగ్ చేస్తూ ప్రకృతి సంపదను అడ్డంగా దోచేస్తున్నారు. గత కొద్దిరోజులుగా గువ్వలగుట్టను పెద్ద పెద్ద ప్రోక్లింగ్ లను ఉపయోగిస్తూ, టిప్పర్లతో రాత్రింబవళ్లు నిర్విరామంగా అక్రమంగా మట్టిని తరలిస్తూ ప్రకృతి సంపదను కొల్లగొడుతున్న ఇదేమిటని ప్రభుత్వ వ్యవస్థలు ప్రశ్నించకపోవడంతో, అక్రమార్కులు అడ్డంగా కొల్లగొట్టి మట్టిని అమ్ముకుంటున్నారు.సంఘటన స్థలానికి వెళ్లి ప్రత్యక్షంగా విచారించగా తమకు ఎలాంటి అనుమతులు లేవని, మండల స్థాయి ప్రజా ప్రతినిధి అండతో మట్టిని తరలిస్తున్నట్టు బహిరంగంగా మమ్మల్ని ఎవరు ఏమి చేయలేరన్నట్లు అక్రమార్కులు విర్రవీగుతున్నారు.మండల పరిధిలోని తాసిల్దార్ మరియు జిల్లా భూగర్భ గనుల శాఖ అధికారులు అక్రమంగా మైనింగ్ చేసిన అధికారుల వైపు కనీసం చూడకపోవడంతో వారి ఆటలు కొనసాగుతున్నాయని గ్రామస్తులు వాపోయారు.ఈ విషయంపై శ్రీరంగాపురం తాసిల్దార్ మురళి గౌడ్ ను వివరణ కోరగా తాము ఎలాంటి అనుమతులు ఎవరికి ఇవ్వలేదని, అక్రమంగా మైనింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.