జ్వాలాతోరణం ఏర్పాటు స్థలం పక్కన వాహన పూజ
1 min readపల్లెవెలుగు వెబ్ మహానంది: మహానంది క్షేత్రంలో కార్తీకమాసంలో జ్వాలాతోరణం ఏర్పాటు చేసే స్థలం పక్కనే ఒక కాంట్రాక్టర్ మూడు వాహనాలకు వాహన పూజ నిర్వహించడం వివాదాస్పదంగా మారింది. సాధారణంగా ఆ కాంట్రాక్టర్ కు అగర్బత్తీలు అమ్ముకోవడానికి క్షేత్ర ప్రధాన ద్వారం ఎదురుగా జ్వాలాతోరణం ఏర్పాటు చేసే స్థలం పక్కన కేటాయించబడినది. అక్కడ భక్తులకు అవసరమగు అగర్బత్తీలు మరియు సాంప్రదాయ దుస్తులు ధరించడానికి అవసరమయ్యే దుస్తులను అమ్ముకోవడానికి కూడా కొంత స్థలాన్ని కేటాయించారు. ఇదే అదునుగా భావించిన ఆ కాంట్రాక్టర్ అందరూ చూస్తుండగానే తమ యొక్క సొంత వాహనాలకు అక్కడ వాహన పూజ ఆదివారం నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం వాహన పూజ నిర్వహించిన స్థలంలో ఎవరైనా వివిఐపీలు వస్తే తమ వాహనాల్లో అక్కడి వరకు అనుమతించి అక్కడినుండి గౌరవ మర్యాదలతో ఆలయ ప్రవేశ ద్వారం నుండి స్వామి అమ్మవార్ల దర్శనానికి వెళ్తూ ఉండడం సహజం. విఐపి, వీవీఐపి వాహనాలకు సంబంధించి అక్కడ ఎలాంటి వాహనాలను శుభ్రపరచడం గాని వాహన పూజ కార్యక్రమాలు కానీ జరిపిన సందర్భాలు లేవు. ఇందుకు విరుద్ధంగా కాంట్రాక్టర్ వ్యవహరించడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాధారణంగా వాహన పూజ టికెట్ తీసుకున్న వ్యక్తులు ఆలయ ప్రాంగణం బయట వాహన పూజ చేయటానికి పూజారులతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించడం జరిగింది. కానీ ఎవరైనా వాహన పూజ నిర్వహించాలంటే ఆలయ ప్రాంగణం బయట నిర్వహించాలి మరియు తప్పనిసరిగా టికెట్ తీసుకోవాలి అనే నిబంధన విధించబడి ఉంది. పాలకమండలిలో ఒకరికి ఆ కాంట్రాక్టర్ సన్నిహిత కీలక వ్యక్తి కావడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ సంఘటనకు సంబంధించి ఆ కాంట్రాక్టర్ పై చర్య తీసుకొని సదర్ కాంట్రాక్టర్ నిర్వహిస్తున్న కాంట్రాక్టు రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు. ఆలయ పరివర్తన నియమావళికి విరుద్ధంగా వ్యవహరించడం వల్ల భారీ మొత్తంలో జరిమానా విధించాలని పలువురు కోరుతున్నారు. గతంలో ఉద్యోగులు గాని కాంట్రాక్టర్లు గానీ తప్పులు చేసిన సందర్భంలో జరిమాణాలు విధించారని ఇప్పుడు కూడా అలా విధిస్తే మరలా ఇంకెవరు ఇలాంటి సాహసం చేయరని భక్తులు పేర్కొంటున్నారు. మరి చర్యలు తీసుకుంటారా లేదా అనేది తేలాల్సింది. సాధారణ భక్తులకు ఒక న్యాయం కాంట్రాక్టర్లకు మరో న్యాయమా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అయితే అక్కడి వరకు వాహనాలను ఎవరు అనుమతించారు ఎందుకు అనుమతించారు వారిపై కూడా ఎలాంటి చర్య తీసుకుంటారు అనేది చర్చనీయాంశంగా మారింది.