సిపిఎస్… జిపిఎస్ లను తక్షణమే రద్దు చేయాలి: ఏపీటీఎఫ్
1 min readపల్లెవెలుగు వెబ్ గడివేముల: ఉపాధ్యాయ ,ఉద్యోగులకు పదవి విరమణ తర్వాత సామాజిక భద్రత లేని సిపిఎస్, జిపిఎస్ లను తక్షణమే రద్దుచేసి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఈనెల 29న విజయవాడలోని ధర్నా చౌక్ లో ఏపీటీఎఫ్ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరుప తలపెట్టిన రాష్ట్రస్థాయి ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను (గోడపత్రికలను,) కరపత్రాలను బుధవారం మండలంలోని గడిగరేవుల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏపీటీఎఫ్ నాయకులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన ఉపాధ్యాయుల సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి నగిరి శ్రీనివాసులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు 57 ప్రకారం 2004 కంటే ముందు నోటిఫికేషన్ తో నియామకమైన 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు, పోలీసులకు, ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. ప్రతి నెల ఒకటో తేదీన ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు జీతాలు, పెన్షనర్లకు పెన్షన్లను చెల్లించాలని, ప్రాథమిక విద్య నాశనం అవ్వడానికి కారణమైన జీవో నెంబర్ 117 ను రద్దుచేసి ప్రాథమిక పాఠశాలలోని 3,4,5, తరగతులను ఉన్నత పాఠశాలలో విలీనం చేయడాన్ని ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఉపాధ్యాయ, ఉద్యోగులకు దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఆర్థికపరమైన బకాయిలు పిఎఫ్ లోన్లు, ఎపిజిఎల్ఐ లోన్లు, తుది క్లెయిమ్స్, సరెండర్ నగదు బిల్లులను, డిఏ బకాయిలు అన్ని కలిపి దాదాపు 30 వేలకు పైగా ఉన్న ఆర్థిక బకాయిలనుతక్షణమే చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డీఎస్సీ నిర్వహించి ఖాళీగా ఉన్న 25 వేల ఉపాధ్యాయ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల అంతర్ జిల్లా బదిలీలు చేపట్టాలని కోరారు. మూడు వేలకు పైగా పెండింగ్ లో ఉన్న కారుణ్య నియామకాలను వెంటనే చేపట్టాలని, మున్సిపల్ ఉపాధ్యాయులకు సర్వీస్ రూల్స్ అమలు చేసి బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని, సమగ్ర శిక్షలో పనిచేసే సిబ్బందికి మూడు నెలల నుండి జీతాలు చెల్లించడం లేదని తక్షణమే వారికి జీతాలు చెల్లించాలని తదితర 17 డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వం దృష్టికి అనేకసార్లు తీసుకొని పోవడం జరిగిందని, అయితే సమస్యల పరిష్కారంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా ఈనెల 29వ తేదీన విజయవాడలోని ధర్నా చౌక్ నందు ఏపీటీఎఫ్ చేపడుతున్న రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమంలో ఉపాధ్యాయులు , ఉద్యోగులు , పెన్షనర్లు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నాను విజయవంతం చేయాలని ఆయన వారికి పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు జె రాజేంద్రప్రసాద్, జిల్లా కార్యదర్శి ఆవుల మునిస్వామి, గడివేముల మండల శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఎల్. బాలస్వామి, మానపాటి రవి, సీనియర్ నాయకులు రాంపుల్లారెడ్డి, ప్రతాపరెడ్డి, మల్లికార్జునయ్య, మారెన్న, శ్రీరాములు, మహిళా ప్రతినిధులు కవిత, చంద్రావతి, పుష్ప కుమారి, ఆదిశేషమ్మ, లక్ష్మీదేవి, లలితమ్మ, హరిత తదితరులు పాల్గొన్నారు.