68 ఏళ్ల మహిళకు అరుదైన గుండె సమస్య
1 min read– రక్తనాళాల్లో బ్లాక్.. ఆపై పేరుకుపోయిన కాల్షియం;
– బ్లాక్ కారణంగా 18కి పడిపోయిన హృదయ స్పందన రేటు
– పేస్‌మేకర్ పెట్టి, ఆపై కాల్షియం పగలగొట్టిన అమోర్ వైద్యులు
– అత్యాధునిక వైద్య సదుపాయాలతో సాధ్యమైన చికిత్స
పల్లెవెలుగు వెబ్ హైదరాబాద్ : ఒకే రోగిలో గుండె ప్రధాన రక్తనాళాల్లో బ్లాక్ ఉండటంతో పాటు, భారీగా కాల్షియం పేరుకుపోయిన అరుదైన సమస్యను అమోర్ ఆస్పత్రి వైద్యులు నయం చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన 68 ఏళ్ల మహిళకు మధుమేహం లేదు, రక్తపోటు కూడా ఎక్కువగా లేదు. అయినా ఇంత అత్యంత తీవ్రమైన సమస్య వచ్చింది. ముందుగా ఆమె తల తిరగడం, కొద్దిసేపు స్పృహ కోల్పోవడం లాంటి లక్షణాలు కనిపించడంతో అమోర్ ఆస్పత్రికి వచ్చారు. ఆమెకు వచ్చిన సమస్యలు, అందుకు తాము అందించిన చికిత్స వివరాలను అమోర్ ఆస్పత్రికి చెందిన కన్సల్టెంట్ ఇంటర్వెన్షల్ కార్డియాలజిస్టు డాక్టర్ ఇమ్రాన్ ఉల్ హక్ తెలిపారు. “తల తిరుగుతోందన్న కారణంగా ముందుగా ఆమెకు న్యూరాలజీ విభాగంలో పరీక్షలు చేయగా, ఎలాంటి సమస్య లేదని తేలింది. దాంతో అప్పుడు కార్డియాలజీ విభాగానికి పంపారు. ఇక్కడ ముందుగా ఆమెకు ఈసీజీ చేసి చూడగా, అందులో బైఫాసిక్యులర్ బ్లాక్ ఉన్నట్లు తేలింది. ఈ తరహా బ్లాక్ ఉండి, స్పృహ కోల్పోవడం అంటే తప్పనిసరిగా ఆమెకు పర్మనెంట్ పేస్‌మేకర్ పెట్టాల్సిన అవసరం ఉంటుందని అర్థం. అయితే, అలా పెట్టడానికి ముందు ఆమెను హోల్టర్ మానిటర్ (24 గంటలు నిరంతరం ఈసీజీ తీయడం)తో పరిశీలించాం. అప్పుడు ఆమె గుండె రక్తనాళాల్లో బ్లాక్ తీవ్రంగా ఉందని, దానివల్ల ఆమె నిద్రపోతున్నప్పుడల్లా హృదయ స్పందన రేటు నిమిషానికి 18-20 సార్లకు పడిపోతోందని తెలిసింది. దీనివల్ల ఆమెకు ఏ నిమిషంలోనైనా కార్డియాక్ అరెస్టు కూడా కావచ్చు. అనంతరం కరొనరీ యాంజియోగ్రామ్ చేసి చూడగా, ఎడమవైపు కిందకు వెళ్లే ప్రధాన రక్తనాళం (ఎల్ఏడీ) ప్రాంతం బాగా గట్టిగా ఉన్నట్లు కనిపించింది. అయితే, ఈ ఎల్ఏడీలో రక్తప్రవాహం మాత్రం సాధారణంగానే ఉంది. అందువల్ల అది కరొనరీ హార్ట్ బ్లాక్‌కు కారణం కాదు. ముందుగా ఆమె హృదయ స్పందన రేటును సరిచేయడానికి పర్మనెంట్ పేస్‌మేకర్ అమర్చాం. పేస్‌మేకర్ గాయం నయమైన తర్వాత ఎల్ఏడీలో బ్లాక్‌ను సరిచేయడానికి పెర్క్యుటేనియస్ కరొనరీ ఇంటర్వెన్షన్ (పీసీఐ) అనే ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించాం. దీనివల్ల రక్తనాళంలో పూడుకుపోయిన భాగాలను సరిచేసి, రక్తప్రవాహాన్ని సాధారణ స్థాయికి తీసుకురావచ్చు. అయితే, ఈ కేసులోని ఎల్ఏడీలో కాల్షియం పేరుకుపోవడం వల్ల బాగా గట్టిపడింది. అలాంటప్పుడు స్టెంట్ వేసినా అది తెరుచుకోదు. అందువల్ల అత్యాధునికమైన ఆప్టికల్ కొహెరెన్స్ టోమోగ్రఫీ (ఓసీటీ) అనే పరిజ్ఞానంతో కాల్షియం ఎక్కడ, ఎంత ఉందో పూర్తి స్థాయిలో 3డి ఇమేజిల ద్వారా ఒక అంచనాకు వచ్చాం. సాధారణ ఇంట్రావాస్క్యులర్ అల్ట్రాసౌండ్ (ఐవీయూఎస్) కంటే పదిరెట్లు ఎక్కువ రిజల్యూషన్‌తో రక్తనాళాల పూర్తి వివరాలు తెలుస్తాయి. దీని ద్వారా కాల్షియం స్థాయిని తెలుసుకుని, దాన్ని పగలగొట్టేందుకు ఇంట్రావాస్క్యులర్ లిథోట్రిప్సీ (ఐవీఎల్) అనే అత్యాధునిక పరికరాన్ని ఉపయోగించాం. ఇది రక్తనాళంలోకి వెళ్లిన తర్వాత ఒక బెలూన్ సాయంతో షాక్ వేవ్స్ పంపడం ద్వారా బాగా గట్టిగా పేరుకుపోయిన కాల్షియంను పగలగొట్టి, రక్తనాళాన్ని సాధారణ స్థితికి తీసుకొస్తుంది. అప్పుడు మరోసారి కాల్షియం వల్ల అది గట్టిబడిపోకుండా ఉండేందుకు అక్కడ ఒక స్టెంట్ కూడా వేశాం. దానివల్ల రోగి పూర్తిగా కోలుకున్నారు. రెండు రోజులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఆమెను డిశ్చార్జి చేశాం” అని డాక్టర్ ఇమ్రాన్ ఉల్ హక్ వివరించారు.