జాతీయ ఐక్యతకు.. సమగ్రతకు ప్రతీక పటేల్
1 min read– సంబేపల్లి హైస్కూల్లో ఘనంగా రాష్ట్రీయ ఏక్తా దివస్ వేడుకలు.
పల్లె వెలుగు అన్నమయ్య జిల్లా బ్యూరో: భారతదేశ ఐక్యతకు, సమగ్రతకు ప్రతీక సర్దార్ వల్లభాయ్ పటేల్ అని సంబేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మడితాటి నరసింహారెడ్డి అన్నారు. భారతదేశ ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకొని మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ప్రార్థన సమయంలో రాష్ట్రీయ ఏక్తా దివస్( భారతదేశ ఐక్యతా దినోత్సవం) ప్రతిజ్ఞను నిర్వహించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు విద్యార్థులతో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ భారతదేశం యొక్క స్వాతంత్రం పోరాటంలో కీలక పాత్ర పోషించారన్నారు. భారతదేశం స్వాతంత్రం పొందిన తర్వాత సామ, దాన, భేద, దండోపాయాలతో మొట్టమొదటగా 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. తర్వాత హైదరాబాద్, జునాగడ్, కాశ్మీర్ సంస్థానాల విలీనంలో కీలకపాత్ర పోషించారన్నారు. ఇండియన్ బిస్మార్క్ గా, భారతదేశ ఉక్కుమనిషిగా పటేల్ పేరు గడించారన్నారు. అందుచేత ఆయన జన్మించిన అక్టోబర్ 31వ తేదీని 2014 నుండి భారతీయ ఐక్యత దినోత్సవంగా (రాష్ట్రీయ ఏక్తా దివస్) దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నామన్నారు. భారతదేశానికి మొదటి హోం మంత్రిగా, ఉప ప్రధానిగా, సమాచార ప్రసారాల శాఖ మంత్రిగా ఆయన చేసిన సేవలు ఎనలేనివన్నారు.
విద్యార్థుల భారీ ర్యాలీ:
భారతదేశ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులు శంకరయ్య, జయరాం నాయక్, ఈశ్వరయ్యల ఆధ్వర్యంలో పాఠశాల విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పాఠశాల మైదానం నుండి ప్రారంభమై కడప- చిత్తూరు జాతీయ రహదారి మీదుగా కొనసాగింది. ఈ ర్యాలీలో విద్యార్థులు ప్లకార్డులు చేత పట్టుకొని ” దేశ ఐక్యత-మన భద్రత”, “భిన్నత్వంలో ఏకత్వం మా భారతదేశం”, “భారత్ మాతాకీ జై”, “భారత దేశ ఉక్కుమనిషి పటేల్” అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.