కళాశాల కాంపౌండ్ వాల్ నిర్మాణం పూర్తయ్యేనా..!
1 min readపల్లెవెలుగు,మిడుతూరు: నంద్యాల జిల్లా మిడుతూరు మండలం కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రహరీ గోడను త్వరితగతిన పూర్తి చేయాలని పిడిఎస్.యు జిల్లా ఉపాధ్యక్షుడు పి.మర్రిస్వామి డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళాశాల అభివృద్ధిలో భాగంగా మంజూరు అయిన ప్రహరీ గోడను ప్రారంభించి గత కొద్ది సంవత్సరాలు అయినా పునాదులు వేసినవి వేసినట్టే ఉన్నాయి గానీ ఇంతవరకు ప్రహరీ గోడను పూర్తిచేసిన దాఖలాలు లేవని వారు ఆరోపించారు.రాష్ట్ర ముఖ్యమంత్రి అధికారంలోకి రాగానే ప్రభుత్వ పాఠశాలలను, కళాశాలలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి విద్యార్థులకు మంచి విద్యను, ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని అందిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఇప్పటికీ నాలుగున్నర ఏళ్లు కావస్తున్నా అభివృద్ధి మాత్రం శూన్యం అని ఆయన తెలియజేశారు. సంబంధిత అధికారులు ప్రజా ప్రతినిధులు తక్షణమే స్పందించి కళాశాలలో పునాదుల దగ్గర ఆపివేసిన ప్రహరీ గోడను తక్షణమే పూర్తి చేయాలని వారు డిమాండ్ చేశారు.అలాగే బాలుర మరుగు దొడ్ల నిర్మాణం కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఆపేశారని అభివృద్ధి తక్కువ అవినీతి ఎక్కువ అన్న చందంగా ప్రవర్తిస్తున్నారని.అలాగే నాడు నేడు అభివృద్ధి పనులలో అవినీతిని అరికట్టి, విద్యార్థులకు మంచి మౌలిక వసతులు కల్పించే దిశగా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు చేపట్టాలని వారు తెలియజేశారు.ప్రహరీ గోడ పనులను తక్షణమే ప్రారంభించాలని లేని పక్షాన జూనియర్ కళాశాల విద్యార్థులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని వారు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో పిడిఎస్.యు డివిజన్ నాయకులు విక్రమ్, మల్లి,సంతోష్ తదితరులు పాల్గొన్నారు.