PALLEVELUGU

PALLEVELUGU | Telugu Latest News | PALLEVELUGU.IN | KURNOOL ANDHRA PRADESH

పిత్త‌వాహిక‌లో ఇరుక్కుపోయి.. తుప్పుపట్టిన స్టెంట్‌

1 min read

రెండేళ్ల క్రితం స్టెంట్ వేసిన విష‌యాన్ని మ‌ర్చిపోయిన రోగి

మ‌ళ్లీ తీవ్రంగా కామెర్లు, జ్వ‌రంతో క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి రాక‌

సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌తో న‌యం చేసిన డాక్ట‌ర్ జాన‌కిరామ్‌

అరుదైన కొలెడోస్కొపీతో మొత్తం రాళ్ల వెలికితీత‌

 పల్లెవెలుగు వెబ్ కర్నూలు: రెండేళ్ల క్రితం తీవ్రంగా కామెర్లు వ‌చ్చిన రోగికి వాటిని తగ్గించేందుకు ఒక స్టెంట్ వేస్తే.. ఆ విష‌యాన్ని మ‌ర్చిపోయి, దాన్ని తీయించుకోలేదు. దాంతో అది కాస్తా లోప‌ల బాగా తుప్పు ప‌ట్టి పాడైపోయి, దాని చుట్టూ రాళ్లు ఏర్ప‌డి తీవ్ర స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మైంది. అత్యంత సంక్లిష్ట‌మైన శ‌స్త్రచికిత్స‌తో ఆ రోగికి క‌ర్నూలు కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన క‌న్స‌ల్టెంట్ స‌ర్జిక‌ల్ గ్యాస్ట్రో ఎంట‌రాల‌జిస్టు డాక్ట‌ర్ ఎస్.జె. జాన‌కిరామ్ ఊర‌ట క‌ల్పించారు. ఈ రోగి స‌మ‌స్య‌లు, అత‌డికి అందించిన చికిత్స వివ‌రాల‌ను ఆయ‌న తెలిపారు.”ఆళ్ల‌గ‌డ్డ ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల యువ‌కుడు తీవ్ర‌మైన జ్వ‌రం, అధికా కామెర్ల‌తో ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. బైలురూబిన్ స్థాయి 10 వ‌ర‌కు ఉంది. రెండేళ్ల క్రితం అత‌డికి గాల్‌బ్లాడ‌ర్‌లో రాళ్లు ఉన్న‌ప్పుడు నిర్ల‌క్ష్యం చేయ‌డంతో అవి కిందికి జారి, పిత్త‌వాహిక‌లోకి ప‌డిపోయాయి. సాధార‌ణంగా కాలేయం నుంచి వ‌చ్చే స్రావాలు కింద పేగుల్లోకి రావాలి. కానీ, అక్క‌డ‌.. గాల్‌బ్లాడ‌ర్‌లోను రాళ్ల ఉండ‌టంతో ఆ స్రావాలు కాలేయంలోనే ఉండిపోయి, కామెర్లు వ‌చ్చాయి. దాంతో రెండేళ్ల క్రితం వేరే ప్ర‌భుత్వాస్ప‌త్రిలో అత‌డికి ఎండోస్కొపీ చేసి చూసి, పిత్త‌వాహిక‌లో ఉన్న రాళ్లు తొల‌గించి, ఒక స్టెంట్ పెట్టారు. సాధార‌ణంగా ఒక నెల రోజుల త‌ర్వాతే ఆ స్టెంట్ తీసేసి, దాంతోపాటు గాల్ బ్లాడ‌ర్ కూడా తొల‌గించాలి. లేక‌పోతే స్టెంట్ బ్లాక్ అయ్యి, అక్క‌డ మ‌ళ్లీ రాళ్లు త‌యార‌వుతాయి. కానీ రోగి రెండు సంవ‌త్స‌రాల పాటు ఆ స్టెంట్ విష‌యాన్ని మర్చిపోయాడు. త‌న‌కు కామెర్లు త‌గ్గిపోయాయ‌ని ఊరుకున్నాడు.మ‌ళ్లీ రెండేళ్ల త‌ర్వాత అత‌డికి ఇప్పుడు తీవ్రంగా కామెర్లు, జ్వ‌రం రావ‌డంతో కిమ్స్ ఆస్ప‌త్రికి వ‌చ్చాడు. అప్పుడు అత‌డికి ముందుగా ఎండోస్కొపిక్ రెట్రోగ్రేడ్ కొలంగియోపాక్రియాటోగ్ర‌ఫీ (ఈఆర్‌సీపీ) చేశాం. లోప‌ల ఇంత‌కుముందు వేసిన స్టెంట్‌కు తుప్పు ప‌ట్టి, దాని చుట్టూ రాళ్లు ఏర్ప‌డ్డాయి. సాధార‌ణంగా అయితే రాళ్లు, మ‌ట్టి, స్టెంట్ తీసేసి కొత్త స్టెంట్ వేయాలి. కానీ ఈ పాత స్టెంట్ ముట్టుకుంటే విరిగిపోతుంది. రాళ్లు ఎంత తీసినా ఇంకా వ‌స్తూనే ఉన్నాయి త‌ప్ప మొత్తం క్లియ‌ర్ చేయ‌లేక‌పోతున్నాం. దాంతో  ముందుగా కామెర్లు త‌గ్గించ‌డానికి మ‌రో స్టెంట్ వేశారు. అవి త‌గ్గ‌డానికి రెండు వారాలు ప‌ట్టింది. త‌ర్వాత మ‌ళ్లీ వ‌చ్చిన‌ప్పుడు చూస్తే.. పాత స్టెంట్ టిష్యూలో అతుక్క‌పోవ‌డంతో తీయ‌డం అంత సుల‌భంగా సాధ్యం కాలేదు. గోటితో పోయేదానికి గొడ్డ‌లి వ‌ర‌కు వెళ్లిన‌ట్లు రెండేళ్ల క్రితం చిన్న లాప‌రోస్కొపీ చేస్తే స‌రిపోయేది. ఇప్పుడు లాప‌రోస్కొపీ చేసి ముందుగా గాల్ బ్లాడ‌ర్ తీసేశాం. పిత్త‌వాహిక‌ను నిలువుగా కొద్దిగా క‌త్తిరించి, రాళ్లు తీసేశాం. కానీ స్టెంట్ రావ‌ట్లేదు. దాంతో ఓపెన్ స‌ర్జ‌రీ మొద‌లుపెట్టి, స్టెంట్, రాళ్లు, అన్నీ తీసేశాం. త‌ర్వాత పిత్త‌వాహిక‌లోకి ఒక 5 మిల్లీమీట‌ర్ల కెమెరా (కొలెడోస్కొపీ) పంపించి, లోప‌ల ఇంకా ఏమైనా రాళ్లున్నాయేమోన‌ని చూశాం. ఇంకా కొన్ని రాళ్లున్నాయి. దాంతో ఒక పైపున‌కు బెలూన్ పెట్టి.. దాంతో లాగితే రాళ్ల‌న్నీ బ‌య‌ట‌కు వ‌చ్చాయి. అలా మొత్తం లోప‌లున్న రెండు స్టెంట్లు, రాళ్లు, మ‌ట్టి.. అన్నీ తీసేశాం. పాత స్టెంటు రెండు ముక్క‌లైపోయింది. అన్నీ తీసేయ‌డంతో అత‌డికి పూర్తిగా న‌య‌మైంది. వారం రోజుల పాటు ఆస్ప‌త్రిలో ప‌రిశీల‌న‌లో ఉంచి, అన్నీ సాధార‌ణంగా ఉండ‌టంతో డిశ్చార్జి చేశాం” అని డాక్ట‌ర్ జాన‌కిరామ్ వివ‌రించారు.

About Author